
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
మోపాల్(నిజామాబాద్‌రూరల్): గురుకులాల్లో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. శుక్రవారం మండలంలోని కంజర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కిచెన్, విద్యార్థులకు అందించే భోజనం, తరగతి గదులు, హాస్టల్, లైబ్రరీని పరిశీలించారు. అనంతరం అంకిత్ మాట్లాడుతూ గురుకులంలో 608 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం వడ్డించాలని తెలిపారు. విష పురుగులు రాకుండా చెత్తాచెదారం ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ విజయలలిత, సిబ్బంది ఉన్నారు.
పరిసరాల పరిశుభ్రత పాటించాలి
డిచ్‌పల్లి: వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని విద్యార్థినులకు మండల ఆరోగ్య విస్తరణాధికారి (హెచ్‌ఈవో) వై.శంకర్ సూచించారు. శుక్రవారం ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల లో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించి సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెచ్‌ఈవో శంకర్ మాట్లాడారు. పాఠశాల చుట్టూ పరిసరాలను, మెస్ హాల్, వంట గదులను పరిశుభ్రంగా ఉంచాలని ప్రిన్సిపాల్ నళిని కి సూచించారు. విద్యార్థినులు పౌష్టికాహారాన్ని తీసుకున్నట్లయితే రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి రోగాలు దరిచేరవన్నారు.కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు గంగుబాయి, వెంకట్ రెడ్డి, ఉదయ, ఎంఎల్‌హెచ్‌పీ మలేహ సుల్తానా, కీర్తన, గ్రామ పంచాయతీ కార్యదర్శి కవిత, ఆశా కార్యకర్తలు సంధ్య, నిర్మల, మంజుల, నిరోషా, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కంజర్ సాంఘిక సంక్షేమ
బాలికల గురుకుల పాఠశాల తనిఖీ
అదనపు కలెక్టర్ అంకిత్