
స్థానిక బరిపై గురి
● స్థానిక ఎన్నికల్లో నిలిచేందుకు నాయకులు,
శ్రేణుల ప్రణాళికలు
● అభ్యర్థిత్వాల కోసం కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు
● మరోవైపు గ్రామాల్లో విందు సమావేశాలు
● మద్దతు కూడగట్టుకునేందుకు
నాయకుల కసరత్తులు
● రిజర్వేషన్లపై ఉత్కంఠగా ఎదురుచూపులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: స్థానిక సంస్థల్లో అధికారం చేజిక్కుంచుకునేందుకు గాను ప్రధాన రాజకీయ పార్టీల శ్రేణులు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం పూర్తయి ఏడాదిన్నర, పరిషత్‌ల పదవీకాలం ముగిసి ఏడాది కావస్తోంది. మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలాలు పూర్తయి ఐదు నెలలు దాటిపోయింది. అన్ని చోట్లా ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. దీంతో అభివృద్ధి పనుల విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజాసమస్యల పరిష్కారం అంతంత మాత్రంగానే ఉంది. కాగా సెప్టెంబర్ 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో పల్లెల్లో, పట్టణాల్లో స్థానిక పోరు సందడి నెలకొంది. నిజామాబాద్ నగరపాలక సంస్థలో ఎట్టిపరిస్థితుల్లో పాగా వేసేందుకు బీజేపీ పకడ్బందీగా పావులు కదుపుతోంది. ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణలు విడతలవారీగా సర్వేలు సైతం చేయించారు. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇందూరు నగరపాలకాన్ని చేజిక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, షబ్బీర్‌అలీలు కసరత్తులు చేస్తున్నారు. ఆర్మూర్, బోధన్, భీంగల్ మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు నువ్వా నేనా అనేవిధంగా పట్టుదలతో ఉన్నాయి. ఇక జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజా పరిషత్‌లలో, గ్రామ పంచాయతీల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పకడ్బందీగా కసరత్తులు చేస్తోంది. బీజేపీ పంచాయతీలు, పరిషత్‌లలో పాగా వేసేందుకు ప్లాన్ చేస్తోంది. త్రిముఖ పోటీలో తమకు కలిసొస్తుందని బీఆర్‌ఎస్ అంచనాలు వేసుకుంటోంది.
రిజర్వేషన్ల విషయమై ఉత్కంఠగా..
సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న ఆశావహులు రిజర్వేషన్ల ఖరారు కోసం ఎదురు చూస్తున్నారు. రిజర్వేషన్లు తాము ఆశించినవిధంగా వస్తే టిక్కెట్లు దక్కించుకునేందుకు కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లోని డివిజన్లలో విందు సమావేశాలు నిర్వహిస్తున్నారు. మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎమ్మెల్యేల సుడిగాలి పర్యటనలు షురూ..
ఎమ్మెల్యేలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు గెలిపించుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వరుసగా చేస్తున్నారు. అదేవిధంగా సీఎంఆర్‌ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నారు. ఇక సన్నబియ్యం, సన్నధాన్యం బోనస్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు తమకు కలిసొస్తాయని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఇక స్థానిక ఎన్నికలకు ముందు పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి వస్తున్న అమిత్‌షా రైతు సమ్మేళనం సభలో పాల్గొననుండడంతో తమకు పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ తిరుగులేని బలం పెరుగుతుందని బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో, పట్టణాల్లో హడావుడి రోజురోజుకూ పెరుగుతోంది.