
లభించని అభయహస్తం
మోర్తాడ్(బాల్కొండ): అభయహస్తం సొమ్మును మహిళల ఖాతాల్లో తిరిగి జమ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. అంతకు ముందే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం ముగిసిపోయినా ఇప్పటి వరకు అభయహస్తం సొమ్మును దరఖాస్తుదారుల ఖాతాల్లో ఇప్పటికీ జమ కాలేదు. మహిళా సంఘాల్లోని సభ్యులకు 55 ఏళ్ల వయస్సు నిండితే వారికి పింఛన్‌ను అమలు చేసేందుకు ఉమ్మడి రాష్ట్రంలో రూపుదిద్దుకున్న అభయహస్తం పథకాన్ని రద్దు చేసి ఏళ్లు గడుస్తోంది. జిల్లాలోని మహిళలకు సంబంధించి రూ.12,67,69,610 బ్యాంకులోనే మూలుగుతున్నాయి. ఈ సొమ్మును వాపస్ చేసేందుకు రెండేళ్ల కింద మహిళా సంఘాల ప్రతినిధులు అభయహస్తం సభ్యత్వ రుసుం చెల్లించిన మహిళల వివరాలను నమోదు చేసుకున్నారు. అభయహస్తం పథకాన్ని 2017లో నిలిపివేసి అప్పటి నుంచి పింఛన్‌ల పంపిణీని రద్దు చేశారు. అలాగే పింఛన్ అర్హుల సొమ్మును బ్యాంకులోనే ఉంచారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా కొనసాగిస్తున్న మహిళా సంఘాల్లో మెజార్టీ మహిళలు పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే ఉన్నారు. మహిళల పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వం అభయహస్తం సభ్యత్వ సొమ్మును వారి ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వానికి పలువురు సూచిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
అభయహస్తం పింఛన్ పథకం కింద ఉమ్మడి జిల్లాలో 13,506 మందిని అర్హులుగా గుర్తించి వారితో రూ.3,685 చొప్పున జమ చేయించారు. వారికి ప్రతి నెలా రూ.500 చొప్పున పింఛన్ అందించారు. మరో 40వేల మందిని సభ్యులుగా చేర్చుకుని ప్రతి సంవత్సరం ఒక్కొక్కరితో రూ.385 చొప్పున ఐదేళ్లపాటు రూ.1,925 జమ చేయించారు. అభయహస్తం పథకంలో చేరిన వారికి భవిష్యత్‌లో ఆర్థికంగా లబ్ధి చేకూర్చాలని దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భావించారు.
‘అభయహస్తం పథకం కింద మహిళా సంఘాల సభ్యులు చెల్లించిన సభ్యత్వ సొమ్మును తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తాం.. గత ప్రభుత్వంలా మేము నిర్లక్ష్యం చేయబోము.’ – అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి
పథకం రద్దు చేసి ఏళ్లు గడుస్తున్నా..
దరఖాస్తుదారుల
ఖాతాల్లోకి చేరని సొమ్ము
జిల్లా మహిళలకు రావాల్సిన మొత్తం రూ.12.67కోట్లు