
మొలకెత్తని సోయా విత్తనాలు
డొంకేశ్వర్ (ఆర్మూర్): మార్కెట్లో దొరుకుతున్న విత్తనాలతో రైతులు మోసపోతున్నారు. అవి నకిలివో, మంచివో తెలియక కొనుగోలు చేసి విత్తుతున్నారు. ఎన్నిరోజులైనా మొలకలు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. డొంకేశ్వర్ మండలం దత్తాపూర్‌కు చెందిన లంబాడి రాజు రూ.10 వేలు ఖర్చు చేసి మూడు సోయా విత్తన ప్యాకెట్లను స్థానికంగా కొనుగోలు చేశాడు. రెండెకరాల్లో విత్తనాలు విత్తి పది రోజులైనా ఇప్పటి వరకు మొలకలు రాలేదు. నీటిని అందించినా అంతే పరిస్థితి ఉండడంతో పెట్టుబడిని కోల్పోయాడు. చేసేదేమి లేక మళ్లీ రూ.5వేలు పెట్టి మక్క విత్తనాలు కొని సోయా వేసిన పొలంలోనే విత్తాడు. ఈవిధంగా దత్తాపూర్‌లోనే కాకుండా మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంది రైతులు వేసిన సోయా విత్తనాలు మొలకెత్తలేదని పేర్కొంటున్నారు. ఐతే, స్థానికంగా గ్రామాల్లో లైసెన్సు లేని కొంతమంది వ్యాపారులు విత్తనాలు తయారు చేసి రైతులకు అంటగడుతున్నారు. అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, రైతులకు న్యాయం జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు.