
గోపాల మిత్రల గోడు పట్టదా!
పెర్కిట్(ఆర్మూర్): పాడి పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తున్న గోపాల మిత్రలకు ప్రభుత్వం నుంచి 9నెలలుగా జీతాలు అందక ఆందోళన చెందుతున్నారు. అసలే చాలీచాలని గౌరవ వేతనంతో నెట్టుకొస్తున్న తమకు సకాలంలో జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు లేక కుటుంబ పోషణ భారమవుతుందని పేర్కొంటున్నారు.అయినా తమ దుస్థితిని ఎవరూ పట్టించుకోవడంలేదంటున్నారు.
చాలీచాలని వేతనం..
పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గోపాల మిత్రలకు ప్రతి నెల లక్ష్యాలను నిర్ధేశించి పశువులకు కృత్రిమ గర్భాధారణ చేయిస్తున్నారు. గోపాల మిత్రలకు జాతీయ కృత్రిమ గర్భాధారణ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనంగా రూ.11,050 చొప్పున అందజేస్తున్నారు. వీరు వేసవిలో నెలకు 50 నుంచి 60, ఇతర సీజన్లలో 100 నుంచి 120 పశువులకు కృత్రిమ గర్భాధారణ చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను ఒక్కో కృత్రిమ గర్భాధారణకు రైతుల నుంచి రూ.40లు వసూలు చేసి, ప్రభుత్వ ఖాతాలో జమా చేయాల్సి ఉంటుంది. కృత్రిమ గర్భాధారణ లక్ష్యం పూర్తయిన, కాకపోయిన అనుకున్న సంఖ్య ప్రకారం ప్రభుత్వ ఖాతాల్లో వారు డబ్బులు జమా చేయాలి. ఒక్కోసారి అనుకున్న లక్ష్యం పూర్తి కాకపోతే వారి జీతం నుంచి కోతలు తప్పవు. అసలే చాలీచాలని వేతనంతో ఇబ్బందులు పడుతుంటే అందులో కోతలు విధిస్తుంటే ఏమి మిగలడం లేదని వారు వాపోతున్నారు. అలాంటిది 9నెలలుగా జీతాలు రాకపోవడంతో తమ కష్టాలు తీవ్రంగా మారాయంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తమకు వెంటనే వేతనాలు అందించాలని గోపాలమిత్రలు కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 132 మంది..
తొమ్మిది నెలలుగా అందని జీతాలు
పట్టించుకోని అధికారులు
కుటుంబ పోషణ భారంగా మారింది..
తాము చాలీచాలని జీతంతో కుటుంబాలను నెట్టుకొస్తున్నాం. దీనికి తోడు తొమ్మి ది నెలలుగా జీతం రాకపోవ డంతో కుటుంబ పోషణ భా రంగా మారింది. ప్రభుత్వం మా కు ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశతో 24సంవత్సరాలుగా సేవలందిస్తున్నాను. ప్రభుత్వం స్పందించి మా సమస్యలను పరిష్కరించాలి.
–ఉంగరాల రాజన్న, గోపాల మిత్ర, ఇస్సాపల్లి
గ్రామాల్లో పశువుల సంరక్షణకు జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ(డిస్ట్రిక్ట్ లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ ఏజేన్సీ) ద్వారా గోపాల మిత్ర వ్యవస్థను 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో 132 మంది గోపాల మిత్రలు సేవలు అందిస్తున్నారు. గ్రామాల్లో పశువులకు కృత్రిమ గర్భాధారణ చేయడంతోపాటు పాడి రైతులకు అందుబాటులో ఉంటూ పశువులకు ప్రథమ చికిత్సలు అందిస్తున్నారు. అలాగే పశు వైద్యుల సూచనల మేరకు నట్టల నివారణ మందులు, వ్యాక్సినేషన్ వంటి అన్ని రకాల వైద్య సేవలందిస్తున్నారు.

గోపాల మిత్రల గోడు పట్టదా!

గోపాల మిత్రల గోడు పట్టదా!