
సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరాలి
మోర్తాడ్: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి లబ్ధిదారుడికి చేరే విధంగా ఉద్యోగులు కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. పథకాల అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. భీమ్‌గల్ మున్సిపాలిటీలో బుధవారం ఆయన పర్యటించారు. పట్టణంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నివారణ కోసం చేపడుతున్న చర్యలపై మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వార్డుల వారీగా సమీక్షించి ప్రణాళికబద్దంగా కార్యక్రమాలను అమలు చేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఆదేశించారు. వన మహోత్సవం కింద మొక్కలను నాటించడమే కాకుండా వాటిని సంరక్షించడానికి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించి పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చూడాలన్నారు. అనంతరం బోయగల్లి, బాపూజీనగర్‌లలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఆగష్టు 14వరకు భూమి సమస్యలపై వచ్చిన దరఖాస్తులకు పరిష్కారం చూపాలని సూచించారు. జిల్లా మలేరియా నియంత్రణ విభాగం అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, తహసీల్దార్ షబ్బీర్, ఎంపీడీవో సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.