
కాసర్లకు బెస్ట్ టీచర్ అవార్డు
మోపాల్: హైదరాబాద్‌లోని ఏఎస్‌రావు నగర్‌లో బుధవారం వరల్డ్ క్లారిటీ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ఈకార్యక్రమంలో మోపాల్ మండలం సిర్‌పూర్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు కాసర్ల నరేష్‌రావు నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డును అందుకున్నారు. విద్యావేత్తలు నాగేశ్వర్‌రావు, మీను శ్రీ, మిస్ తెలంగాణ జెనియా, చారిటీ సంస్థ నిర్వాహకులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 200 మంది సభ్యులు పాల్గొన్నారు. కాసర్లకు డీఈవో అశోక్ తదితరులు అభినందనలు తెలియజేశారు.
అధ్యాపక పోస్టులకు
దరఖాస్తుల ఆహ్వానం
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): జిల్లాలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను పార్ట్‌టైం ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా కోఆర్డినేటర్ మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. జేఎల్– ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, పీజీటీ– ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, సోషల్ స్టడీస్, టీజీటీ–బయో సైన్స్ ఖాళీలు ఉన్నాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ)తో పాటు బీఈడీ విద్యార్హత కలిగి ఉండి, కనీసం ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలని ఆమె తెలిపారు. అర్హత, ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 28న డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలో గల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలలో హాజరు కావాలన్నారు. డెమో, అనుభవం ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని జిల్లా కోఆర్డినేటర్ తెలిపారు.