
తీవ్ర జాప్యం.. యువతలో నైరాశ్యం
మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా యువత నుంచి రుణాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. జిల్లాలో వేలాదిగా యువత దరఖాస్తులను చేసుకుంది. కానీ నెలలు గడుస్తున్నా రుణాల పంపిణీ ప్రక్రియ ముందుగు సాగడం లేదు. దీంతో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు రుణాల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. పంపిణీలో తీవ్ర జాప్యం నెలకొనడంతో యువత నైరాశ్యం చెందుతున్నారు.
జిల్లాలో 58వేల మంది..
రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా రుణాల పంపిణీని ఆరంభిస్తామని ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తులను స్వీకరించే సమయంలోనే ప్రకటించింది. కానీ ఇప్పటి వరకూ ఎప్పుడు ఆరంభిస్తారో షెడ్యూల్‌ను వెల్లడించలేదు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 58వేల మందికి పైగా ఆశావహులు నిరీక్షిస్తున్నారు. రూ.50వేల వరకు రుణం కోసం దరఖాస్తు చేసుకునేవారికి వంద శాతం రాయితీని వర్తించేలా ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. రూ.1లక్ష రుణానికి 90 శాతం రాయితీని, రూ.1లక్ష నుంచి రూ.2లక్షల వరకూ రుణాలకు 80 శాతం రాయితీని, రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు రుణాలకు 70 శాతం రాయితీని అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అనేక మంది రూ.4లక్షల వరకు రుణం కావాలని దరఖాస్తు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఏ ఒక్కరికి కూడా రుణాలను పంపిణీ చేయలేదు. వాయిదా వేసినప్పటికీ మరో షెడ్యూల్‌ను ఖరారు చేయకపోవడంతో నిరుద్యోగులకు నిరీక్షణ తప్పడం లేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోను రాయితీ రుణాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఇప్పటి ప్రభుత్వ హయాంలోను ఇదే పరిస్థితి కొనసాగితే ఎలా అని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రాయితీ రుణాల కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
జాడ లేని రాజీవ్ యువ
వికాసం రుణాల పంపిణీ
షెడ్యూల్ ప్రకారం సాగని ప్రక్రియ
మోర్తాడ్‌కు చెందిన మహేష్ బ్యాంగిల్ స్టోర్ ఏర్పాటు చేయడానికి రాజీవ్ యువ వికాసం కింద రూ.4లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సిబిల్ స్కోర్ బాగుండటంతో బ్యాంకర్లు కూడా అతని దరఖాస్తును మొదటి ప్రాధాన్యత జాబితాలో ఉంచారు. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించే ప్రక్రియను వాయిదా వేయడం, కనీసం అమలు చేసే షెడ్యూల్‌ను ప్రకటించకపోవడంతో మహేష్‌కు రుణం దక్కలేదు. సొంతంగా వ్యాపారం ఆరంభించాలని దరఖాస్తుదారుడు భావించినా పెట్టుబడి పెట్టే స్థోమత లేకపోవడంతో తన కలలను సాకారం చేసుకోవడం కోసం ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకున్నాడు. రుణ పంపిణీలో తీవ్ర జాప్యం కారణంగా అతడు ఆందోళన చెందుతున్నాడు. ఇలా జిల్లాలోని నిరుద్యోగ యువత ప్రభుత్వం అందించే రాయితీ రుణాల కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వం స్పందించాలి..
రాజీవ్ యువ వికాసం పేరిట రుణాలు ఇచ్చి ఆదుకుంటామని దరఖాస్తులు తీసుకుని ఇప్పటి వరకూ ఏ ఒక్కరికి కూడా నయాపైసా రుణం ఇవ్వలేదు. యువతను నమ్మించి మోసం చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. ప్రభుత్వం స్పందించి వెంటనే రాయితీ రుణాలకు నిధులు విడుదల చేయాలి.
– తక్కూరి సాగర్, దరఖాస్తుదారుడు, మోర్తాడ్
యువతకు దారి చూపాలి..
నిరుద్యోగులైన యువతీయువకులు ఎంతో ఆశతో రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారి కి సకాలంలో రాయితీ రుణా లు ఇవ్వకపోతే ఇబ్బంది ఎదురవుతుంది. స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి రాయితీ రుణాలు ఇచ్చి అండగా ఉండాలి.
– తోకల నర్సయ్య, మాజీ సర్పంచ్, తాళ్లరాంపూర్

తీవ్ర జాప్యం.. యువతలో నైరాశ్యం

తీవ్ర జాప్యం.. యువతలో నైరాశ్యం