
డ్రగ్స్ నియంత్రణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి
ఖలీల్‌వాడి: డ్రగ్స్ నియంత్రణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సీపీ పోతరాజు సాయిచైతన్య ఎస్సైలకు సూచించారు. జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయంలో మంగళవారం నిజామాబాద్ డివిజన్‌లోని పోలీసు అధికారులకు నేరాల నియంత్రణపై నెలవారి సమీక్ష నిర్వహించారు. ఈసందర్బంగా సీపీ మాట్లాడుతూ.. వచ్చే ఆరు నెలల్లో ప్రతి ఎస్‌హెచ్‌వో లక్ష్యాలు పెట్టుకొని నేరాల నియంత్రణ కోసం ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్‌ల వారీగా పెండింగ్‌లో ఉన్న కేసులను క్షుణ్ణంగా సమీక్షించి, త్వరితగతిన దర్యాప్తు ముగించడానికి తగిన సూచనలు చేశారు. మహిళల భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, వారికి అన్ని రకాల భద్రతల విషయంలో ఎల్లప్పుడు సహకారం అందించాలని తెలియజేశారు. మట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి మొదలగు చట్టవ్యతిరేక కార్యాకలాపాలపై ప్రత్యేకమైన ‘నిఘా’ ఏర్పాటు, లాడ్జీలలో ఎప్పటికప్పుడు ముమ్మరంగా తనిఖీలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఎన్‌బీడబ్ల్యూఎస్‌పై ప్రత్యేకంగా డివిజన్ పరిధిలో టీమ్స్ ఏర్పాటు చేసి త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయాలని సూచించారు. రాత్రి వేళల్లో వాహనాల తనిఖీ చేసి, దొంగతనాల నివారణకు కృషి చేయాలన్నారు. డయల్ 100 ఫిర్యాదుల పట్ల త్వరితగతిన స్పందించాలన్నారు. నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్లు శ్రీశైలం పాల్గొన్నారు.