
విద్యా ప్రణాళిక లక్ష్యాలు సాధించాలి
బోధన్: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపుదల లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఎఫ్‌ఎల్‌ఎన్ (ఫౌండేషన్ లిటరసీ న్యూమర్సీ), ఎల్‌ఐపీ (లె ర్నింగ్ ఇంప్రూమెంట్ ప్రోగ్రాం) రెండు విద్యా ప్రణాళికలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేసి లక్ష్యాలు సాధించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఎంఈవోలకు సూచించారు. పట్టణంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన రుద్రూర్, కోటగిరి, పోతంగల్, వర్ని, చందూర్, మోస్రా మండలాల ఎంఈవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు చదవటం, రాయటం, గణిత పరిజ్ఞాన నైపుణ్యాలాభివృద్ధి ఎఫ్‌ఎల్‌ఎన్ ప్రణాళిక లక్ష్యమన్నారు. విద్యాప్రణాళికల అమలును పర్యవేక్షించాలని సూచించారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం 2వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల నిర్ధారణకు ఈ నెల 25 నుంచి 30 వరకు ప్రతి పాఠశాలలో బేస్‌లైన్ పరీక్షలు ఉంటాయని ప్రస్తావించారు. ఉపాధ్యాయుల ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు.