
చికిత్స పొందుతూ ఒకరి మృతి
భిక్కనూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. భిక్కనూరు ఎస్సై అంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన చెట్లపల్లి రవి (42) ఈనెల 14న తాటికొండ అశోక్ అనే వ్యక్తికి జ్వరం రావడంతో చికిత్స కోసం అతడిని బైక్‌పై ఎక్కించుకొని భిక్కనూరు ప్రభుత్వాస్పత్రికి బయలుదేరారు. మార్గమధ్యలో వారి బైక్‌ను కామారెడ్డి వైపు నుంచి భిక్కనూరుకు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో రవికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం అతడిని హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ రవి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.