
ఇంజినీరింగ్ కళాశాల మంజూరుకు కృషి
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు అన్ని రకాల వసతులు ఉన్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కళాశాల మంజూరుకు కృషి చేస్తానని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. తెయూలో జరిగిన జాతీయ సదస్సుకు హాజరైన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెయూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు తగిన సౌకర్యాలు, ఫ్యాకల్లీ ఉందన్నారు. ఈమేరకు వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరిలతో కలిసి తాను క్యాంపస్‌లోని భవనాలను, వసతి సౌకర్యాలను పరిశీలించినట్లు తెలిపారు. అలాగే యూజీసీ ఆదేశాల ప్రకారం ఈ విద్యాసంవత్సరం నుంచి అన్ని యూజీ, పీజీ కళాశాలల్లో 20 శాతం స్కిల్ బేస్‌డ్ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఇతర టెక్నికల్ కోర్సులు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థికి స్కిల్ (నైపుణ్యం) అత్యంత అవసరమని, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ ఉన్నట్లే థర్డ్ లాంగ్వేజ్ ఇకనుంచి స్కిల్ కోర్సులు ఉండాలని ఆయన వివరించారు. అలాగే కళాశాలలు కంపెనీలతో ఎంవోయూ చేసుకుని ఉపాధి అవకాశాలు సృష్టించాలన్నారు. సిలబస్‌లో మార్పులు చేస్తున్నామని, ఇందుకు వేర్వేరు రెగ్యులేటరీ కమిటీలు అనుమతులు అవసరమన్నారు. త్వరలోనే అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల ఖాళీలను గుర్తించి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు.
ఉన్నత విద్యామండలి చైర్మన్‌కు వినతి..
తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయాలని వర్సిటీ ఎన్‌ఎస్‌యూఐ నాయకులు కోరారు. ఈమేరకు వారు మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ఆయనను సత్కరించారు. ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షు డు బానోత్ సాగర్ నాయక్, నాయకులు శ్రీనునాయక్, విజయ్, వెంకటేష్, నరేష్ తదితరులున్నారు.

ఇంజినీరింగ్ కళాశాల మంజూరుకు కృషి