
వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్య
వర్ని: మండలంలోని జాకోరా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వర్ని ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన కమ్మరి సతీష్ (40) ఫొటో గ్రాఫర్‌గా జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున అతడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే సతీష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
లింగంపేట మండలంలో..
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని అయిలాపూర్ గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన మున్నూరుపల్లి సాయిలు–అనసుజ దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. కొడుకు మున్నూరుపల్లి అశోక్(22) ఇంటర్ వరకు చదివి, గొర్లను కాస్తున్నాడు. కొంత కాలంగా దుబాయి వెళ్తానని తల్లిదండ్రులకు చెప్పగా వారు వద్దని వారించారు. పెళ్లి చేసుకొమ్మని చెప్పగా తర్వాత చేసుకుంటానన్నాడు. మనస్తాపం చెందిన అశోక్ మంగళవారం ఉదయం తెల్లవారుజామున దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికందిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. లింగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పంపుసెట్ కేబుల్ వైర్లు చోరీ
వేల్పూర్: వేల్పూర్ మండలం జాన్కంపేట్ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు పంటపొలాల వద్ద సుమారు 20 వ్యవసాయ పంపుసెట్‌ల కేబుల్ వైర్లు చోరీ చేశారని గ్రామ రైతులు తెలిపారు. ఒక్కో పంపు సెట్‌కు స్టాటర్ నుంచి జాయింట్ వరకు అయిదు నుంచి ఇరవై మీటర్ల వరకు కేబుల్ వైరు ఉంటుందన్నారు. వైరును కత్తిరించి ఒర్రెలో కాల్చి అందులో ఉండే కాపర్ వైరును తీసుకెళ్లినట్లు తెలుస్తోందన్నారు. ప్రతి రైతుకు సుమారు రూ.2వేల వరకు నష్టం వాటిళ్లినట్లు వారు మంగళవారం తెలిపారు.

వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్య