
సన్నబియ్యం పంపిణీపై ఫిర్యాదులు రావొద్దు
సుభాష్‌నగర్ : సన్నబియ్యం పంపిణీ సాఫీగా సాగేలా పకడ్బందీగా పర్యవేక్షించాలని, ఏ దుకాణంలోనూ బియ్యం నిల్వలు లేవనే ఫిర్యాదులు రావొద్దని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్‌లో ఉన్న 21వ నంబర్ రేషన్ దుకాణాన్ని కలెక్టర్ బుధవారం సందర్శించి లబ్ధిదారులకు స్వయంగా సన్నబియ్యం పంపిణీ చేశారు. బియ్యం నాణ్యత, స్టాక్‌ను సరిచూశారు. బయోమెట్రిక్ ద్వారా కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్న విధానాన్ని గమనించి తన వెంట ఉన్న అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాలలో సన్న బియ్యం నిల్వలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. జిల్లాలో మంగళవారం నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైందని, బుధవారం మధ్యాహ్నం వరకు 3183.095 మెట్రిక్ టన్నుల పంపిణీ పూర్తయ్యిందని తెలిపారు. కలెక్టర్ వెంట సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, సహాయ అధికారి రవిరాథోడ్, రేషన్ డీలర్ హిమబిందు, రేషన్ డీలర్ల సంఘం జిల్లా కార్యదర్శి పార్థసారథి, నగర కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, సంయుక్త కార్యదర్శి విక్కీ యాదవ్ తదితరులున్నారు.
రేషన్ షాపుల తనిఖీ
జిల్లాకేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీలో ఉన్న 23, 31వ నంబర్ రేషన్ దుకాణాలను అదన పు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో బియ్యం పంపిణీ చేశారు, ఇంకా ఎంత మందికి పంపిణీ చేయాల్సి ఉంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అ వాంతరాలు లేకుండా సజావుగా బియ్యం పంపిణీ జరిగేలా చూడాలని రేషన్ డీలర్లు సంధ్యారాణి, గంగామణిని ఆదేశించారు. ఆ యన వెంట అధికారులు ఉన్నారు.
సాఫీగా సాగేలా అధికారులు
పర్యవేక్షించాలి
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు