
అర్ధరాత్రి కూడా విధుల్లోనే..
లక్ష్మణచాంద: మండల కేంద్రం నుంచి పీచర మధ్యలో 11 కేవీ విద్యుత్ లైన్ సమస్య ఏర్పడి శుక్రవారం అర్ధరాత్రి సరఫరా నిలిచిపోయింది. దీంతో వినియోగదారులు ఫోన్ చేయడంతో స్పందించిన విద్యుత్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్తంభం ఎక్కి మరమ్మతు చేసి సరఫరాను పునరుద్ధరించారు. అర్ధరాత్రి వేళ సిబ్బంది విధులు నిర్వర్తించి విద్యుత్ లైన్ సమస్య పరిష్కరించారు. ఏఈ మహేశ్ వారిని అభినందించారు. ఇందులో సబ్ ఇంజినీర్ తిరుపతి, ఏఎల్‌ఎం తిరుపతి, జేఎల్‌ఎం చంద్రశేఖర్, నర్సయ్య తదితరులు ఉన్నారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
సోన్: పురుగుల మందు తాగిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని మాదాపూర్‌కు చెందిన సల్ల భోజవ్వ (54)కు కుమారుడు నరేశ్ ఉన్నారు. నరేశ్‌కు పెళ్లి చేసింది. పదేళ్ల క్రితం భర్త నరేశ్‌తో గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భోజవ్వ బాధపడుతుండేది. కోడలు రావడం లేదని మనస్తాపం చెందిన ఆమె శుక్రవారం సాయంత్రం ఇంట్లో గుర్తు తెలియని పురుగుల మందు తాగింది. కుమారుడు నరేశ్ గమనించి నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. కుమారుడు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.గోపి తెలిపారు.