
● సీట్లకు మించిన ప్రవేశాలు ● గేట్ల వద్ద నో అడ్మిషన్ బో
కేజీబీవీ పాఠశాలలు, కళాశాలలు ఇంతటి ఆదరణ పొందడానికి అనేక కారణాలు ఉన్నాయి:
సొంత భవనాలు: జిల్లా వ్యాప్తంగా చాలా కేజీబీవీలకు సొంత భవనాలు ఉండటం.
ఉత్తమ ఫలితాలు: పదో తరగతి, ఇంటర్‌లో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం.
నాణ్యమైన భోజనం: ఇంటిని మరిపించే వసతులతో రుచికరమైన భోజనం అందించడం.
సురక్షిత వాతావరణం: బాలికలు సురక్షితంగా ఉంటారనే నమ్మకం తల్లిదండ్రులలో ఏర్పడటం.
నిరంతర పర్యవేక్షణ: విద్యార్థినులపై నిరంతరం శ్రద్ధ వహించడం.
ఉచిత సౌకర్యాలు: పుస్తకాలు, నోట్‌బుక్‌లు, దుస్తులు ఉచితంగా అందించడం.
ఉత్తమ బోధన: నాణ్యమైన విద్యా బోధన లభ్యం కావడం.
లక్ష్మణచాంద: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిరుపేద, తల్లిదండ్రులు లేని, చదువు మధ్యలో ఆపేసిన బాలికలు విద్యాభ్యాసం కొనసాగించేందుకు కస్తూరిబాగాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ) ప్రారంభమయ్యాయి. ఈ పాఠశాలలు ఇంటిని మరిపించే వసతులతో నాణ్యమైన విద్యను అందిస్తూ బాలికలలో అక్షరాస్యత శాతాన్ని పెంచుతున్నాయి. మొదట 6 నుంచి 10వ తరగతి వరకు విద్యను అందించిన కేజీబీవీలను ప్రభుత్వాలు ఏటా జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నాయి. ఇంటర్‌లో కూడా కేజీబీవీ విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. దీంతో కేజీబీవీల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో విపరీతమైన పోటీ ఏర్పడుతోంది.
సీట్ల కోసం తీవ్ర పోటీ
జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాలకు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి నాయకుల వరకు సిఫారసులు వస్తున్నాయి. అయినా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, విద్యార్థుల ప్రతిభ ఆధారంగానే ప్రవే శాలు కల్పిస్తున్నట్లు కేజీబీవీ సెక్టోరియల్ అధికారులు (ఎస్‌వోలు) తెలిపారు.
6వ తరగతిలో 815 ప్రవేశాలు
నిర్మల్ జిల్లాలో 18 కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాల కోసం ఒక్కో పాఠశాలలో 40 సీట్ల చొప్పున మొత్తం 720 సీట్లు అందుబాటులో ఉండగా, ఇప్పటికే 815 మంది విద్యార్థులు ప్రవేశం పొందారని సెక్టోరియల్ అధికారి సలోమి కరుణ తెలిపారు. పరిమిత సీట్లను మించి ప్రవేశాలు జరిగినందున, చాలా చోట్ల నో అడ్మిషన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇంటర్‌లో 966 ప్రవేశాలు
జిల్లా వ్యాప్తంగా 15 కేజీబీవీలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఒక్కో కళాశాలలో రెండు గ్రూపులకు ఒక్కో గ్రూపులో 40 సీట్ల చొప్పున, మొత్తం 80 సీట్లు ఉండగా, 15 కళాశాలల్లో 1,200 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ ద్వారా ఇప్పటికే 966 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. మిగిలిన 234 సీట్లు రెండు మూడు రోజుల్లో భర్తీ అవుతాయని సలోమి కరుణ తెలిపారు.
ఉత్తమ ఫలితాలతో డిమాండ్..
నిర్మల్ జిల్లాలో ఉన్న 18 కేజీబీవీ పాఠశాలలు, 15 కేజీబీవీ కళాశాలల్లో ప్రవేశాలకు రెండు మూడేళ్లుగా డిమాండ్ పెరుగుతోంది. జిల్లా విద్యార్థులు పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. నాణ్యమైన బోధన అందుతుండడంతో ఫలితాలు మెరుగవుతున్నాయి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకు వస్తున్నారు. పోటీ నేపథ్యంలో నిరుపేద బాలికలకు ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాం.
– సలోమి కరుణ, సెక్టోరియల్ అధికారి నిర్మల్
జిల్లా సమాచారం...
మొత్తం కేజీబీవీ పాఠశాలలు 18
6వ తరగతిలో సీట్లు 720
ఇప్పటి వరకు చేరిన విద్యార్థులు 815
మొత్తం కేజీబీవీ కళాశాలలు 15
సంవత్సరంలో మొత్తం సీట్లు 1,200
ఇప్పటి వరకు చేరిన విద్యార్థులు 966

● సీట్లకు మించిన ప్రవేశాలు ● గేట్ల వద్ద నో అడ్మిషన్ బో