
‘మా భూములు మాకు కావాలి’
కడెం: తమ పోడు భూములు తమకే కావాలని మండలంలోని నచ్చన్‌ఎల్లాపూర్ పంచాయతీ పరిధి లోని గోండుగూడ వాసులు డిమాండ్ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో రత్నకళ్యాణి, ఎఫ్‌డీవో రేవంత్‌చంద్ర మంగళవారం గోండుగూడ వాసులతో సమావేశమయ్యారు. చెట్లు నరికి ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్న భూములను రాంపూర్, మైసంపేట్ వాసులకు కేటాయించడం సరి కాదని గ్రామస్తులు పేర్కొన్నారు. రాంపూర్, మైసంపేట్ గ్రామస్తులకు పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో సాగు భూములు ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం 60 ఎకరాల భూమిలో విత్తనాలు వేశామని తెలిపారు. తమ భూములు దక్కకపోతే చచ్చిపోతామని అధికారులను హెచ్చరించారు. అంతకుముందు ఎఫ్‌డీవో రేవంత్‌చంద్ర అటవీ అధికారులతో కలిసి రాంపూర్, మైసంపేట్ పునరావాస గ్రామస్తులకు కేటాయించిన సాగు భూములను పరిశీలించారు. గ్రామస్తులకు త్వరలోనే రెవెన్యూ పట్టాలు ఇస్తామన్నారు. వారివెంట తహసీల్దార్ ఆర్.ప్రభాకర్, ఎఫ్‌ఆర్వో గీతారాణి, ఎస్సై సాయికిరణ్, డీఆర్వోలు సిద్దార్థ, ప్రకాశ్, హైటీకాస్ ఎన్‌జీవో ప్రతినిధి వెంకట్, ఆర్‌ఐ శారద, అటవీ సిబ్బంది రవి, జిజియా, తదితరులు ఉన్నారు.