
అందని గ్యాస్ రాయితీ..!
● లబ్ధిదారులకు తప్పని ఎదురుచూపులు ● జిల్లాలో 2.51లక్షల వంటగ్యాస్ కనెక్షన్లు
భైంసాటౌన్: జిల్లాలో వంటగ్యాస్ సిలిండర్ విని యోగదారులకు రాయితీ సొమ్ము జమ కావడం లేదు. సుమారు ఆరు నెలలుగా రాయితీ డబ్బుల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీల్లోని మహాలక్ష్మి పథకం కింద వంటగ్యాస్ వినియోగదారులకు సిలిండర్‌ను రూ.500లకే అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు కొన్నిరోజులపాటు అందించింది. రాయితీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. కానీ, ఆరు నెలలుగా రాయితీ జమ కాకపోవడంతో వినియోగదారులు ఎవరిని అడగాలో తెలియక అయోమయంలో ఉన్నారు.
జిల్లాలో 2.51 లక్షల గ్యాస్ కనెక్షన్లు..
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టింది. ఇందులో రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తామని పేర్కొంది. ఈ మేరకు ప్రజాపాలన వేదికల్లో దరఖాస్తులు స్వీకరించి, అర్హులను గుర్తించారు. జిల్లాలో మొత్తం 2.51 లక్షల వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కో వినియోగదారు రెండు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఏడాదికి కనీసం ఆరు సిలిండర్లు అవసరమవుతాయి. కేంద్ర ప్రభుత్వం రూ.43 మాత్రమే రాయితీ అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.500లకే అందించేలా మిగిలిన రాయితీ మొత్తం భరించేలా పథకం అమలు చేసింది. కొన్నినెలలపాటు లబ్ధిదారుల ఖాతాల్లో రాయితీ సొమ్ము జమైంది. కానీ, ఆరునెలల నుంచి డబ్బులు జమకావడం లేదు. ఈ విషయమై జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కిరణ్‌కుమార్‌ను ఫోన్‌లో వివరణ కోసం సంప్రదించగా, ఆయన స్పందించలేదు.
జిల్లాలో వంటగ్యాస్ కనెక్షన్లు ఇలా..
దీపం 47,215
ఉజ్వల 37,249
సాధారణ 1,39,430
సీఎస్‌ఆర్ 26,828
ఇతర 1063
మొత్తం 2,51,785
రాయితీ వస్తలేదు..
ఆరునెలల నుంచి వంటగ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బు జమ కావడం లేదు. సిలిండర్‌కు రూ.900లకుపైనే తీసుకుంటున్నారు. రూ.500లకే సిలిండర్ ఇస్తామని, ఇప్పటికీ అందించడం లేదు. డీలర్లను అడిగితే తమకు తెలియదని సమాధానమిస్తున్నారు. ఎవరిని అడగాలో తెలియడం లేదు.
– వడ్నం లక్ష్మీబాయి, గృహిణి, భైంసా

అందని గ్యాస్ రాయితీ..!