మత్తెక్కిస్తున్నరు..! | - | Sakshi
Sakshi News home page

మత్తెక్కిస్తున్నరు..!

May 16 2025 1:41 AM | Updated on May 16 2025 1:41 AM

మత్తె

మత్తెక్కిస్తున్నరు..!

● మద్యం.. గంజాయిని దాటి.. ‘ఇంజక్షన్ల’ దందా.. ● ఈజీమనీ కోసం ‘టెక్నీషియన్లు’ పెడదోవ.. ● జిల్లా యువతపై కొత్త ముప్పు

నిర్మల్‌టౌన్‌: జిల్లాలో మద్యం, గంజాయి మత్తులో మునిగిన యువత ఇప్పుడు ప్రాణాంతకమైన మిడాజోలం ఇంజెక్షన్ల బారిన పడుతోంది. శస్త్రచికిత్సల్లో అనస్థీషియాకు ఉపయోగించే ఈ మత్తు ఇంజెక్షన్లను యువతకు అలవాటు చేస్తూ కొంతమంది ల్యాబ్‌ టెక్నీషియన్లు ఈ దందా నడుపుతున్నారు. ఇటీవల పట్టుకున్న గంజాయి విక్రేతల విచారణలో పోలీసులు మత్తు ఇంజెక్షన్ల విషయం తెలుసుకున్నారు. విక్రేతలపై నిఘా పెట్టి ముఠాను పట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జానకీ శర్మిల, ఏఎస్పీలు రాజేశ్‌ మీనా, ఉపేంద్రారెడ్డి, సీఐ ప్రవీణ్‌ కుమార్‌ వివరాలను గురువారం వెల్లడించారు.

టెక్నీషియన్‌లే సూత్రధారులు

జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో ఎక్స్‌రే టెక్నీషియన్‌గా పనిచేస్తున్న షేక్‌ ఫర్దీన్‌, మిడాజోలం ఇంజెక్షన్ల ద్వారా సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ దందాను ప్రారంభించాడు. అతనితో కలిసి ల్యాబ్‌ టెక్నీషియన్లు అబ్దుల్‌ డానీష్‌, చవాన్‌ గోవింద్‌, స్నేహితుడు మహమ్మద్‌ పర్వేజ్‌ ఈ అక్రమ వ్యాపారంలో భాగమయ్యారు. ఆస్పత్రుల నుంచి మిగిలిన ఇంజెక్షన్లను సేకరించడంతోపాటు, కొన్నిచోట్ల దొంగతనాలకు కూడా పాల్పడ్డారు. గంజాయికి అలవా టు పడిన యువతను లక్ష్యంగా చేసుకుని పర్వేజ్‌ శివారు, నిర్మాణుష్యమైన ప్రాంతాలకు కస్టమర్లను పిలిపించి, వారికి సిరంజీతో మత్తు ఇంజక్షన్‌ ఇచ్చేవాడు. ఒక్కో మిడాజోలం ఇంజక్షన్‌ బుడ్డిలో 5.10 ఎంఎల్‌ లిక్విడ్‌ ఉంటుంది. ఒక్కొక్క కస్టమర్‌ వద్ద రూ.500 తీసుకొని, ఒక ఎంఎల్‌ ఇచ్చేవారు. అలా వచ్చిన డబ్బును నలుగురు పంచుకునేవారు.

యువత జీవితాలపై ముప్పు

మత్తు కోసం దారి తప్పుతూ..

మత్తు కోసం జిల్లా యువత దారితప్పుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు మద్యం, సిగరెట్‌కే పరిమితమైనవాళ్లు ఇప్పుడు గంజాయి, డ్రగ్స్‌, వైట్‌నర్‌, ఇంజక్షన్లు ఇలా.. ఎటో వెళ్లిపోతున్నారు. మత్తులో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నా రు. కుటుంబాలనూ ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఇప్పటికే గంజాయి మత్తులో నిండమునిగిన యువత ఇప్పుడు ఇలా.. ప్రాణాలకే ప్రమాదమైన మత్తు ఇంజక్షన్లనూ తీసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. మిడాజోలం ఇంజెక్షన్‌లు శస్త్రచికిత్సల్లో అనస్థీషియాకు ఉపయోగించే అత్యంత శక్తివంతమైన మందు. దీనిని నియంత్రణ లేకుండా తీసుకోవడం ప్రాణాంతకం. పోలీసులు ఈ దందాను అరికట్టినప్పటికీ, యువతలో అవగాహన కల్పించడం, ఆస్పత్రుల్లో మందుల నియంత్రణను కఠినం చేయడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

మత్తుపై యుద్ధం..

జిల్లాలో మత్తు పదార్థాలపై జరిపే యుద్ధంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం. మత్తు ఇంజక్షన్లను మెడికల్‌ షాప్‌లలో డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా ఇవ్వరాదు. హాస్పిటల్‌ యాజమాన్యం కూడా మిగిలిపోయిన మత్తు ఇంజక్షన్‌ సీసాలను డిస్పోస్‌ చేయాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను జాగ్రత్తగా గమనించాలి. ఏదైనా తేడా కనిపిస్తే డీఅడిక్షన్‌ సెంటర్‌లో చేర్పించాలి. మత్తు పదార్థాలకు సంబంధించి ఏసమాచారం తెలిసినా వెంటనే 8712659599 ఫోన్‌నంబర్‌కు సమాచారం ఇవ్వాలి.

– జానకీషర్మిల, ఎస్పీ

ప్రాణాలకే ప్రమాదం...

ఎలాంటి మత్తుమందులైనా ఏకాస్త మోతాదు మించినా ప్రాణాలకే ప్రమాదమవుతాయి. మిడాజోలం అనేది శస్త్రచికిత్సల సమయంలో పేషెంట్లకు అన్నిపరీక్షలు చేసిన తర్వాత తగు మోతాదులో ఇస్తుంటాం. ఎక్కువ మోతాదులో తీసుకుంటే శ్వాస ఆగిపోవడం, బ్రెయిన్‌ డ్యామేజీలతో ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది.

– డాక్టర్‌ అశ్వీర్‌రెడ్డి, అనస్థీషియా వైద్యుడు

గంజాయి వేటలో బయటపడిన దందా

జిల్లాలో గంజాయి వ్యాప్తిపై పోలీసులు ముమ్మర దాడులు చేస్తున్న క్రమంలో, అనుమానాస్పద కేసులో పర్వేజ్‌ను అదుపులోకి తీసుకున్న నిర్మల్‌ టౌన్‌ పోలీసులు మిడాజోలం దందాను బయటపెట్టారు. బైల్‌ బజార్‌లో జరిపిన తనిఖీల్లో షేక్‌ ఫర్దీన్‌, అబ్దుల్‌ డానీష్‌, చవాన్‌ గోవింద్‌ను అరెస్టు చేసి, 26 ఇంజెక్షన్‌లు, 10 సిరంజీలు, 4 మొబైల్‌ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విజయంపై ఎస్పీ జానకీ షర్మిల పోలీసు బృందాన్ని అభినందించారు.

మత్తెక్కిస్తున్నరు..!1
1/1

మత్తెక్కిస్తున్నరు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement