
బాసరలో కేంద్రీయ విద్యాలయం
● తాత్కాలిక భవనంలో ఏర్పాట్లు.. ● భవనాన్ని పరిశీలించిన డిప్యూటీ కమిషనర్ డాక్టర్ మంజునాథ్
బాసర: జ్ఞానసర్వసతీ దేవి కొలువై ఉన్న బాసరలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కల నెరవేరబోతోంది. ఇప్పటికే కేందద్రీయ విద్యాలయం మంజూరైంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల డిప్యూటీ కమిషనర్ డాక్టర్ మంజునాథ్ భవన నిర్మాణం కోసం స్థలంతోపాటు, ప్రస్తుతం విద్యాలయం ప్రారంభం కోసం తాత్కాలిక భవనాన్ని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్‌తో కలిసి పరిశీలించారు. ట్రిబుల్ ఐటీ సమీపంలో తాత్కాలిక భవనంతోపాటు, గోదావరి నదికి వెళ్లే దారిలో మరో భవనాన్ని పరిశీలించారు. అధికారులు పలు సూచనలు ఇచ్చారు. విద్యార్థులకు సౌకర్యంగా ఉండే తాత్కాలిక భవనం, అనువైన స్థలం కావాలని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. అనంతరం అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అందరి సహకారంతో త్వరలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌తోపాటు అసిస్టెంట్ కమిషనర్ అనురాధ, నిర్మల్ ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో రామారావు, తహసీల్దార్ పవన్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన కేంద్ర బృందం
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ దక్షిణ భారత విభాగం డిప్యూటీ కమిషనర్ మంజునాథం, అసిస్టెంట్ కమిషనర్ అనురాధ, కలెక్టర్ అభిలాషా అభినవ్‌ను కలెక్టరేట్‌లో గురువారం కలిశారు. బాసరలో కేంద్రీయ విద్యాలయ స్థాపనకు అవసరమైన స్థలాలను పరిశీలించిన విషయాన్ని కలెక్టర్‌కు బృందం వివరించింది. వసతి, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి అనుకూలమైన స్థలాన్ని గుర్తించేందుకు భౌగోళిక పరిస్థితులు, కమ్యూనికేషన్ సదుపాయాలు, భవిష్యత్ అవసరాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. సమావేశంలో ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్‌రెడ్డి పాల్గొన్నారు.