
‘చెర’ విడిపించండి అమాత్యా..!
● శిఖంలో పంటలు సాగు.. ● పట్టణాల్లో ‘రియల్’ ప్లాట్లు.. ● చెరువుల సమీపంలోనే ఇటుక బట్టీలు.. ● నేడు జిల్లాకు రెవెన్యూ మంత్రి ‘పొంగులేటి’ రాక
భైంసా: నిర్మల్ జిల్లాకు చెరువుల జిల్లాగా గుర్తింపు ఉంది. అయితే ఇటీవల ఆక్రమణలు, నిర్వహణ లోపంతో ఈ చెరువులు కనుమరుగవుతున్నాయి. జిల్లాలోని 803 చెరువులు 47,000 ఎకరాలకు సాగునీరు అందించగా, అక్రమ ఆక్రమణలు, పూడిక పెరుగుదల వల్ల వీటి విస్తీర్ణం తగ్గుతోంది. భూ భారతి చట్టం అమలులో ఉన్నప్పటికీ, సర్వేలు, జీపీఎస్ అనుసంధానం లేకపోవడంతో ఆక్రమణలు అడ్డుకట్టలేకపోతున్నాయి.
సిరాల ప్రాజెక్టు దుస్థితి
1901లో నైజాం కాలంలో భైంసా మండలంలో సిరాల వద్ద 320.19 ఎకరాల్లో నిర్మితమైన సిరాల ప్రాజెక్టు, 7 గ్రామాల్లో 4 వేల ఎకరాలకు సాగునీ రు అందించేది. 2004 వరకు ముధోల్ నియోజకవర్గంలో ఇది ప్రధాన ప్రాజెక్టుగా ఉండేది. గతరెండేళ్లలో భారీ వర్షాలతో ఈ చెరువు తెగిపోయింది. 54 ఎకరాల శిఖం భూములు కబ్జా చేయబడి, అక్రమంగా పట్టాలతో పంటలు సాగవుతున్నాయి.
ఇతర చెరువుల ఆక్రమణ
1994లో మాంజ్రి సమీపంలో 70 ఎకరాల్లో, 2014 లో సిరాల శివారులో 73 ఎకరాల్లో నిర్మించిన చెరువులు ఆక్రమణలతో కనుమరుగయ్యాయి. కామోల్‌లోని పోచమ్మ చెరువు (82.30 ఎకరాలు), 180 ఎకరాల పెద్ద చెరువు, సుంక్లిలో 30 ఎకరాల చెరువులో 20 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. రియాల్టర్లు, నాయకులు, అధికారుల కుమ్మక్కుతో నిర్మల్, భైంసా పట్టణాల్లో చెరువులు, బఫర్ జోన్‌లు ప్లాట్లుగా మారుతున్నాయి. ఇలా చెబుతూ పోతే జిల్లా వ్యాప్తంగా చెరువులన్ని కబ్జాలకు గురవుతున్నాయి. ఈ చెరువులను ఎవరు పట్టించుకోవడంలేదు. జిల్లా కేంద్రమైన నిర్మల్‌లోనూ రియాల్టర్‌లు, నాయకులు, అధికారులు కుమ్మకై ్క చెరువులు, కుంటలను సైతం ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి. భైంసా – బాసర, భైంసా – నిర్మల్, నిర్మల్ – సోన్, సారంగాపూర్, నర్సాపూర్, కుంటాల, లోకేశ్వరం, ముధోల్, తానూరు ఇలా అన్ని మండల కేంద్రాల్లోనూ చెరువులు, శిఖం భూములు, బఫర్‌జోన్‌లు ఆక్రమించి ప్లాట్లుగా మార్చి నిర్మాణాలుచేపడుతున్నారు. ఈ పరిస్థితిని ఎవరు నిలువరించడం లేదు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ క్రమంలో చెరువులను కాపాడేందుకు జీపీఎస్‌తో సర్వేలు నిర్వహించి, హద్దులు గుర్తించాలి. ఆక్రమణలను అరికట్టడానికి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది జరిగితే భూగర్భ జలాలు పెరిగి, సాగునీటి ఇబ్బందులు తీరుతాయని రైతులు కోరుతున్నారు.