
దోపిడీపై తిరగబడ్డ రైతులు
ఖానాపూర్: మండలంలోని ఎర్వచింతల్ గ్రామంలోని ఖానాపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు 40 కిలోల వరి ధాన్యం బస్తాకు మూడు కిలోలు అదనంగా తూకం వేస్తూ రైతులను బహిరంగంగా దోపిడీ చేస్తున్నారు. తాలు, తప్ప పేరుతో బస్తాకు మూడు కిలోల చొప్పున అదనంగా తూకం వేయడంతో రైతులు మండిపడ్డారు. మండలంలో ఎక్కడా లేని విధంగా ఎర్వచింతల్‌లో రైతులు క్వింటాల్‌కు 7 కిలోల పైచిలుకు ధాన్యాన్ని అదనంగా తూకం చేయడంపై తిరగబడ్డారు. కేంద్రానికి వచ్చిన పీఏసీఎస్ సీఈవో ఆశన్నతోపాటు సిబ్బంది రాజేశ్వర్, శ్రీకాంత్‌ను కొనుగోలు కేంద్రం ఆవరణలోని పాఠశాల గదిలో నిర్బంధించారు. ఎక్కడా లేని విధంగా తమ వద్ద కోతలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు వచ్చే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఈవో పొరపాటు జరిగిందని మరోసారి కోతలు విధించబోమని ప్రభుత్వ నిబంధనల మేరకే కొనుగోళ్లు చేపడతామని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అనంతరం అక్కడికి వచ్చిన డీసీవో పాపయ్యను సైతం రైతులు నిలదీశారు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే కేంద్రాల నిర్వహణ ఇష్టారాజ్యంగా సాగుతోందని మండిపడ్డారు. కోతలు విధించిన ధాన్యంలో నుంచి కిందిస్థాయి నుండి పైస్థాయి వరకు కమీషన్లు అందడంతోనే అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులు అడిగిన ప్రశ్నలకు డీసీవో పూర్తిస్థాయి సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతకుముందు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొడారి గోపాల్, రైతులు బాదావత్ రవి, రంజిత్, సంతోష్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
ఖానాపూర్ పీఏసీఎస్ సీఈవోతోపాటు సిబ్బందిని నిర్బంధించి నిరసన
అక్కడికి వచ్చిన డీసీవో పాపయ్యను నిలదీసిన అన్నదాతలు

దోపిడీపై తిరగబడ్డ రైతులు