
బోరిగాంలో చిచ్చు?
ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకోవడంలో అలసత్వం
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు..
ముధోల్ : మండలంలోని బోరిగాం గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో సోమవారం బుద్ధ విగ్రహం ప్రతిష్ఠాపన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ భూమి విషయంలో గ్రామంలోని రెండు గ్రూపుల మధ్య కొన్ని నెలలుగా వివాదం కొనసాగుతోంది. గతంలో ఈ సమస్య రెవెన్యూ శాఖ వరకు చేరగా, తాహసీల్దార్ నుంచి ఆర్డీవో వరకు చర్చలు జరిపారు. ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశించారు. అయినా రెవెన్యూ శాఖ ఈ భూమిని ఆధీనంలోకి తీసుకోకుండా నిర్లక్ష్యం చేసింది.
గ్రూపుల మధ్య ఘర్షణ
ఈ నేపథ్యంలో, ఒక గ్రూపు బుద్ధ విగ్రహం ప్రతిష్టాపనకు సిద్ధమైంది. దీనికి మరో గ్రూపు అభ్యంతరం తెలపడంతో, రాళ్లతో దాడులు జరిగే స్థాయికి వివాదం చేరింది. ఎస్పీ జానకీ షర్మిల, భైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ జోక్యంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, భారీ బందోబస్తుతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం గ్రామంలో పోలీసు పికెట్, బందోబస్తు కొనసాగుతోంది.
రెవెన్యూ శాఖపై విమర్శలు
రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం కారణంగానే ఈ సమస్య తలెత్తిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిని రక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారని మండిపడుతున్నారు. అందుకే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని పేర్కొంటున్నారు. తహసీల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ, అనుమతి లేకుండా నిర్మాణాలు చేయవద్దని గతంలో సూచించినట్లు తెలిపారు. భూమి రక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
శాంతి కోసం పోలీసు చర్యలు
ఎస్పీ జానకీషర్మిల ఆదేశాలతో మంగళవారం ఉదయం ముధోల్ సీఐ మల్లేశ్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని ప్రజలకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ముధోల్ ఎస్సై సంజీవ్, ఆయా మండలాల ఎస్సైలు, పోలీసులు, శివంగి టీం పోలీసులు పాల్గొన్నారు.