
కుంటాలను ఆదర్శంగా నిలుపుదాం
● కలెక్టర్ అభిలాష అభినవ్
కుంటాల: రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం అమలు కోసం 28 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందని, ఇందులో కుంటాల మండలాన్ని భూసమస్యలు లేని మండలంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో ఆదర్శంగా నిలుపుదామని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మండలంలోని అంబుగామ గ్రామంలో సోమవారం నిర్వహించిన రెవిన్యూ సదస్సులో మాట్లాడారు. భూభారతి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న ప్రతీ రైతుకు రశీదు ఇవ్వాలని ఆదేశించారు. ఇటీవల గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో దరఖాస్తు చేసుకోని రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు. వాటిని సుమోటోగా తీసుకుని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులతోపాటు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ ద్వారా ఇప్పటి వరకు 431 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఈనెల 13 నుంచి 30 వరకు ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి భూ సమస్యలు పరిష్కరిస్తాయని తెలిపారు. అనంతరం గ్రామస్తులు గ్రామంలోని సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు. స్పందించిన కలెక్టర్ పంచాయతీ కార్యదర్శిని రేపటిలోగా నియమించాలని ఆదేశించారు. అనంతరం కుంటాల తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి కార్యక్రమంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో కోమల్‌రెడ్డి, తహసీల్దార్లు కమల్‌సింగ్, ఎజాజ్ అహ్మద్‌ఖాన్, ప్రవీణ్‌కుమార్, శ్రీకాంత్, లింగమూర్తి, డీటీ నరేశ్‌గౌడ్, ఆర్‌ఐలు అడెల్లు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
నేలపై కూర్చుని.. ఓపికగా సమస్యలు విని..
కుంటాల: భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా కలెక్టర్ అభిలాష అభినవ్ మండలంలోని అంబుగామ గ్రామానికి వచ్చారు. గిరిజన మహిళలు సంప్రదాయ పాటలు పాడుతూ ఆహ్వానించారు. అనంతరం సదస్సుల్లో కలెక్టర్ నేలపై కూర్చొని ప్రజలతో మమేకమై సమస్యలను ఓపికగా విన్నారు. దరఖాస్తులు స్వీకరించారు. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.