
‘యువ వికాసం’ దరఖాస్తు గడువు పెంపు
నిర్మల్‌చైన్‌గేట్: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు గడువు ఈనెల 14 వరకు పెంచినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రాజీవ్ యువ వికాసం పథకంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. శాఖలవారీగా ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు సంబంధిత దరఖాస్తు పత్రాలను మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. పథకంపై సందేహాల ను నివృత్తి చేసేందుకు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దరఖాస్తుదారులు ఎంచుకున్న స్వయం ఉపాధి యూనిట్ల ఆధారంగా శిక్షణ ఉంటుందని తెలిపారు. అనంతరం రాజీవ్ యువ వికాసం హెల్ప్‌డెస్క్ పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, సంక్షేమ శాఖల అధికారులు శ్రీనివాస్, శంకర్, అంబాజీ, మోహన్‌సింగ్, ఏసీడీపీవో నాగలక్ష్మి, ఈడీఎం నదీమ్ తదితరులు పాల్గొన్నారు.