దండేపల్లి(మంచిర్యాల): మండలంలోని కొర్విచెల్మలో ఓ కిరాణ దుకాణంలో గడువు తీరిన పాల ప్యాకెట్ల (సోయ పాలు) విక్రయం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన హనుమాన్ దీక్షాస్వాములు బుధవారం కిరాణ దుకాణంలో పూజాసామగ్రితో పాటు, పాలు కొనుగోలు చేశారు. దీంతో దుకాణం యజమాని వారికి గడువు తీరిన పాల ప్యాకెట్లు ఇవ్వడంతో వాటిని గమనించిన స్వాములు నివ్వెరపోయారు. పాల ప్యాకెట్ల గడువు గత నెల 27 వరకే ఉంది. గడువు ముగిసి నెల రోజులు దాటినా వాటినే ప్రజలకు విక్రయించడంపై మండి పడ్డారు. విషయాన్ని వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేశారు.
నెన్నెలలో పురాతన రాతి విగ్రహం లభ్యం
నెన్నెల(బెల్లంపల్లి): మండలం కేంద్రంలోని పెద్ద చెరువులో పురాతన వినాయక రాతి విగ్రహం ఉన్నట్లు హనుమాన్ దీక్షాపరులు గుర్తించారు. విగ్రహాన్ని బయటకు తీసి ఒక చెట్టు కింద ఉంచి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఇది సుమారు 800ల సంవత్సరాల క్రితం నాటిదని, చాళుక్యులు దేవాలయం గర్భగుడి ద్వారానికి పైభాగానికి సంబంధించిన రాతి విగ్రహమని గన్‌పూర్‌కు చెందిన చారిత్రక, పురావాస్తు పరిశోధకుడు పంజాల సాయిరాం తెలిపారు.
ఎడ్లు చోరీ
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌కు చెందిన రైతులు వైరాగడే ఆనంద్‌రావు, వైరాగడే శ్రవణ్, మెంగ్రె బాబురావుకు చెందిన ఎడ్లు ఉదయం మేత కోసం బయటకు వెళ్లాయి. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో రైతులు శివారు ప్రాంతంలో వెతికేందుకు వెళ్లారు. ఈ క్రమంలో గుండి రహదారి సమీపంలోని ఒర్రె వద్ద మూడు ఎడ్లు చెట్టుకు కట్టేసి ఉండడంతో వాటిని వదిలేసి ఇంటికి తరలించారు. గతంలో సైతం జిల్లా కేంద్రానికి చెందిన పలువురి ఆవులు సైతం అదృశ్యమయ్యాయి. కొంత మంది వ్యక్తులు పశువులను అక్రమంగా బంధించి, కబేళాలకు తరలిస్తున్నారని రైతులు వాపోతున్నారు.