Election Results:ఈశాన్య రాష్ట్రాల ఫలితాలు.. మేఘాలయలో హంగ్‌.. బీజేపీ బిగ్‌ ప్లాన్‌!

Tripura Meghalaya And Nagaland Election Results Live Updates - Sakshi

► ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. త్రిపుర, నాగాలాండ్‌లో మెజార్టీతో మరోసారి అధికారంలోకి వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచే బీజేపీ పూర్తి ఆధిక్యం కనబరిచి రెండు రాష్ట్రా‍ల్లో వికర్టీని అందుకుంది. త్రిపురలో 60 స్థానాలకు గానూ 33 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మ్యాజిక్‌ ఫిగర్‌ 31ని అందుకోవడంతో  మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.  కాంగ్రెస్‌, లెప్ట్‌ కూటమి 14 స్థానాల్లో విజయం సాధించగా.. కొత్త పార్టీ టిప్రా మోథా 13 స్థానాల్లో జయభేరి మోగించి అధికార పార్టీకి ఝలక్ ఇచ్చింది.

► నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమి భారీ విజయాన్ని అందుకుంది. 60 స్థానాలకు గానూ బీజేపీ కూటమి 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది ఎన్‌పీఎఫ్ రెండు స్థానాలు కైవసం చేసుంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. ఇతరులు 21 చోట్ల విజయం సాధించడం గమనార్హం. ఇక్కడ కూడా మ్యాజిక్‌ ఫిగర్‌ 31ని క్రాస్‌ చేయడంతో​ బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి

► మరోవైపు.. మేఘాలయలో హంగ్ వచ్చింది. సీఎం కాన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 25 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోలేకపోయింది. కాంగ్రెస్ ఐదు, బీజేపీ 4 సీట్లతో సరిపెట్టుకున్నాయి. ఇతరులు 25 స్థానాల్లో గెలుపొందారు. అయితే కాన్రాడ్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమని బీజేపీ ప్రకటించింది. ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిస్తే మేఘాలయ ప్రభుత్వంలో కూడా బీజేపీ భాగం కానుంది. ఫలితంగా మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నట్లు అవుతుంది.

► తమిళనాడులోని ఈరోడ్‌ ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ ఈవీకేఎస్ ఎలన్‌గోవన్ ఘన విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికల్లో అధికార డీఎంకే కాంగ్రెస్‌కు మద్దతిచ్చింది. ఈ విజయం సీఎం ఎంకే స్టాలిన్ వల్లే సాధ్యమైందని ఎలన్‌గోవన్‌ పేర్కొన్నారు. ఎన్నికల హామీలను 80శాతం నెరవేర్చినట్లు చెప్పారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 40కి 40 ఎంపీ స్థానాలు డీఎంకే కూటమే కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

► ఈశాన్య భారతంలో కాషాయ జెండా మరోసారి రెపరెపలాడింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటింది. బీజేపీ.. త్రిపురలో రెండో సారి అధికారంలోకి రాగా.. నాగాలాండ్‌లో బీజేపీ-ఎన్డీపీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 

► ఇక, మేఘాలయలో ఎన్‌పీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

► రాత్రి 7 గంటలకు ఢిల్లీ బీజేపీ ఆఫీసుకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. మూడు రాష్ట్రాల విక్టరీ వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. 

► మహారాష్ట్రలోని పుణే జిల్లా కస్బా స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో, కాంగ్రెస్‌ శ్రేణులు, మహా వికాస్‌ అగాడీ కార్యకర్తలు బాణాసంచా కాల్చుతూ సంబురాలు చేసుకుంటున్నారు. 

► త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. బోర్దోవలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం సాహా.. సీపీఎం అభ్యర్థి ఆశిష్‌కుమార్‌ సాహాపై విజయం సాధించారు. 

► మేఘాలయలో హంగ్‌ దిశగా పోలింగ్‌ కౌంటింగ్‌ కొనసాగుతోంది. సీఎం కాన్రాడ్‌ సంగ్మా నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ 17 స్థానాల్లో ఆధిక్యంగా ఉంది. 

► తమిళనాడులోని ఈరోడ్‌ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. కాగా, ఉప ఎన్నికల్లో అధికార డీఎంకే కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. 

► పూణేలోని చించావద్‌ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ లీడింగ్‌ కొనసాగుతోంది.

► పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌డిగీ ఉప ఎన్నికల్లో ఫలితాల్లో కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. కాంగ్రెస్‌, టీఎంసీ మధ్య హోరాహోరి కొనసాగుతోంది. 

► మేఘాలయలో ఫలితాలు హంగ్‌ దిశగా వెళ్తున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ కనపించడం లేదు.

► నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమి భారీ ఆధిక్యంతో 50 స్థానాల్లో దూసుకుపోతోంది.

► త్రిపురలో 60 స్థానాలకు గానూ దాదాపు 39 స్థానాల్లో బీజేపీలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మ్యాజిక్‌ ఫిగర్‌ 31ని క్రాస్‌ చేయడంతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. 

► మేఘాలయలో ఎన్‌పీపీ 28, బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యం 

► నాగాలాండ్‌లో బీజేపీ 21, ఎన్‌పీఎఫ్‌ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. 

► త్రిపురలో బీజేపీ 24 స్థానాల్లో, ట్రిపా 10 స్థానాల్లో, లెఫ్ట్‌ 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 

► అరుణాచల్‌ ప్రదేశ్‌లోని లూమ్లా, జార్ఖండ్‌లోని రామ్‌ఘర్‌, తమిళనాడులోని ఈరోడ్‌, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌డిగి అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం

► మూడు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం

► ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా మేఘాలయలోని తూర్పు పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లాలో జిల్లా మేజిస్ట్రేట్ 144 సెక్షన్ విధించారు. 

 ముఖ్యంగా త్రిపుర అసెంబ్లీ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. బీజేపీని ఓడించేందుకు లెఫ్ట్, కాంగ్రెస్‌ జట్టు కట్టి బరిలో దిగాయి. కొత్తగా తెరపైకి వచ్చిన టిప్రా మోతా కనీసం 15 స్థానాలకు పైగా గెలుచుకుని కింగ్‌మేకర్‌గా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

నాగాలాండ్‌, మేఘాలయలో కూడా ఫలితాలపై చర్చ నడుస్తోంది. 

న్యూఢిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. కాగా, మూడు రాష్ట్రాల్లో 60 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. మ్యాజిక్‌ ఫిగర్‌ 30 దాటిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top