మేము చనిపోయామని అనుకున్నాం.. ఇండిగో బాధితుల ఆవేదన | Trinamool MPs Team On IndiGo Plane Caught In Storm Srinagar | Sakshi
Sakshi News home page

మేము చనిపోయామని అనుకున్నాం.. ఇండిగోలో టీఎంసీ నేతల ఆవేదన

May 22 2025 7:34 AM | Updated on May 22 2025 9:44 AM

Trinamool MPs Team On IndiGo Plane Caught In Storm Srinagar

శ్రీనగర్‌: దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు.. ఢిల్లీ నుంచి ప్రయాణికులతో శ్రీనగర్‌ బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 వడగండ్ల వానలో చిక్కుకుని తీవ్ర కుదుపులకు గురైంది. వడగండ్ల కారణంగా విమానం ముందుభాగం దెబ్బతిని పెద్ద రంధ్రమే ఏర్పడింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై హాహాకారాలు చేశారు. ఇదే విమానంలో ప్రయాణించిన తృణముల్‌ కాంగ్రెస్‌ నేతలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఐదుగురు సభ్యుల తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం డెరెక్ ఓ'బ్రియన్, నదిముల్ హక్, సాగరికా ఘోష్, మనస్ భూనియా, మమతా ఠాకూర్‌తో కూడిన బృందం బుధవారం శ్రీనగర్‌కు వెళ్తున్న 6E2142 విమానంలో ప్రయాణించారు. విమానం ల్యాండ్‌ అయిన తర్వాత సాగరిక ఘోష్‌ మాట్లాడుతూ.. విమానంలో ఒక్కసారిగా కుదుపులు రావడంతో మేమంతా ఇక చనిపోయామని అనుకున్నాం. చావు దగ్గర వరకు వెళ్లి వచ్చినట్టుగా ఉంది. నా జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదు.

విమానంలో ఉన్న వారంతా భయంతో కేకలు వేస్తున్నారు. కొందరు ప్రార్థనలు చేశారు. మమ్మల్ని సురక్షితంగా తీసుకువచ్చిన పైలట్‌కు కృతజ్ఞతలు. విమానం దిగిపోయిన తర్వాత మేమంతా విమానం దెబ్బతిన్న భాగాన్ని చూసి ఖంగుతిన్నాం’ అని చెప్పుకొచ్చారు. భారత్‌, పాక్‌ మధ్య దాడుల వల్ల సరిహద్దుల్లో ప్రభావితమైన ప్రజలకు సంఘీభావం తెలియజేయడానికి వీరంతా శ్రీనగర్‌ వెళ్లినట్టు తెలిపారు. టీఎంసీ ప్రతినిధి బృందం మే 23 వరకు జమ్మూ కాశ్మీర్‌లో ఉంటుంది. శ్రీనగర్‌తో పాటు పూంచ్, రాజౌరిలో వీరు పర్యటించనున్నారు.

ఇదిలా ఉండగా.. 227 మంది ప్రయాణికులతో శ్రీనగర్‌ బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 వడగండ్ల వానలో చిక్కుకుని బుధవారం తీవ్ర కుదుపులకు గురైంది. అప్రమత్తమైన పైలట్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. శ్రీనగర్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో విమానం సురక్షిత ల్యాండింగ్‌కు చర్యలు చేపట్టారు. చివరకు  సాయంత్రం 6.30గంటల సమయంలో విమానాన్ని సురక్షితంగా కిందకు దించారు. విమానం ముందు భాగం దెబ్బతిన్న, ప్రయాణికులు కేకలు వేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సాంకేతిక సమస్యలతో విమానం శ్రీనగర్‌లోనే నిలిచిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement