ఒకప్పటి ఆ రాజసం వేరేలేవల్.. పాపం చివరిక్షణాల్లో ఇలా! | Ranthambore iconic tigress Arrowhead final walk Video Melt Internet | Sakshi
Sakshi News home page

ఒకప్పటి ఆ రాజసం వేరేలేవల్.. పాపం చివరిక్షణాల్లో ఇలా!

Jun 21 2025 6:29 PM | Updated on Jun 21 2025 7:10 PM

Ranthambore iconic tigress Arrowhead final walk Video Melt Internet

ఎంతటి గొప్పవాడైనా సరే.. చివరి రోజులలో అదే మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు.. సహజ సిద్ధమైన విషయాలనే అనుభవిస్తాడు. ఇది మనిషికి మాత్రమే కాదు.. ఇతర ప్రాణులకూ వర్తిస్తుంది. ఆరోహెడ్‌ ఠీవిగా అడవిలో అలా నడిచి వస్తుంటే ఒకప్పుడు రాజసం ఉట్టిపడేది. అలాంటి దాని చివరి క్షణాలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతూ ‘అయ్యో.. పాపం’ అనుకునేలా చేసింది. 

మొసళ్ల బలం నీటిలోనే. అలాంటిది ఆ నీటి నుంచి మొసళ్లను బయటకు లాక్కొచ్చి మరీ వేటాడే సత్తా ఉన్న పెద్దపులిగా మాతామహి మచ్చ్లీ ఓ పేరుండేది. మరి ఆ మచిలీ మునిమనవరాలిగా.. తాను అలాంటి సత్తా ఉన్నదానినే అని నిరూపించుకుంది ఆరోహెడ్‌. అదీ ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డాకే!. 

Arrowhead (T-84) రాజస్థాన్‌లోని రన్‌థాంబోర్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో నివసించిన ఒక ప్రసిద్ధ పులి. జూన్ 19వ తేదీన.. తన 14 ఏళ్ల వయసులో అది కన్నుమూసింది. బోన్‌ క్యాన్సర్‌తో అది మరణించిందని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. అయితే.. చనిపోయే కొన్నిగంటల ముందు దాని కూనను మరో టైగర్‌ రిజర్వ్‌కు తరలించడం పలువురిని కదిలించింది కూడా. 

ఈలోపు.. ఆరోహెడ్‌ చివరి క్షణాలను సచిన్‌ రాయ్‌ అనే నేచర్‌ ఫొటోగ్రాఫర్‌ బంధించారు. లాస్ట్‌ వాక్‌ అంటూ ఆయన తన సోషల్‌ మీడియాలో ఆరోహెడ్‌ వీడియోను షేర్‌ చేసింది. ‘‘అది జూన్‌ 17వ తేదీ. పదమ్‌ తలాబ్‌ వద్ద తీసిన వీడియో ఇది. లెజెండరీ టైగ్రస్‌ ఆరోహెడ్‌ తన చివరి క్షణాల్లో నరకయాతన అనుభవించింది. అది పసికూనగా ఉన్నప్పటి నుంచి నేను దానిని చూస్తు‍న్నా. 

దాని ధైర్యం, సహనం, పోరాటం.. ఆరోహెడ్‌ ఎదిగిన ప్రతీ దశ ఒక అధ్యాయమే. కృష్ణ (T-19), మాతామహి మచ్చ్లీ (T-16) వారసురాలిగా రన్‌థాంబోర్‌ అడవుల్లో తనదైన ముద్ర వేసుకుంది అది. అలాంటిది చివరిక్షణాల్లో.. కొన్ని అడుగులు వేస్తూ కింద పడిపోవడం ఎంతో బాధించింది.  అలా అది ఓ చెట్టు కిందకు వెళ్తుండడం.. అదే దాని చివరి క్షణాలు అని నా మనసు చెప్పింది. కాసేపటికే అది ప్రకృతి ఒడిలోకి ఒరిగి శాశ్వత నిద్రలోకి జారుకుంది అని భావోద్వేగంగా ఓ సందేశం ఉంచారాయన. 

T-84కు ఆరోహెడ్‌ అని పేరు పెట్టడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. దాని ఎడమ చెంపపై బాణం ఆకారపు గుర్తు ఉండడం వల్ల అలా పేరు పెట్టారు. రన్‌థాంబోర్ టైగర్ రిజర్వ్ ప్రాంతం జోన్‌ 2, 3, 4లను ఇది చివరి క్షణాల దాకా తన ఆధీనంలో ఉంచుకుంది. ఫొటోగ్రాఫర్లు, ప్రకృతి ప్రేమికులు దీని రాజసానికి ఫిదా అయిపోయేవారు. బోన్‌ క్యాన్సర్‌ బారిన పడ్డాక.. చివరిరోజుల్లోనూ ఓ మొసలిని ఎదుర్కొని చంపిన వీడియో కూడా ఆ మధ్య బాగా వైరల్‌ అయ్యింది.  

 

Advertisement
 
Advertisement
Advertisement