ఆర్నెళ్ల విరామం అనంతరం తెరుచుకుంటున్న హోటల్స్‌

Maharashtra Govt Issued Guidelines For Hotels And Bars  To Open  - Sakshi

‘మిషన్‌ బిగిన్‌ అగైన్‌’ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం   

సాక్షి, ముంబై: మహారాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు ప్రారంభమవుతున్నాయి. ఇటీవల ప్రకటించినట్టుగానే బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు తెరిచేందుకు ప్రభుత్వం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి కస్టమర్‌కు ప్రవేశం ద్వారం వద్దనే థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలని ఆదేశించింది. కస్టమర్లకు సేవలందించే సమయంలో భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. ఇక డబ్బులు చెల్లించేందుకు అత్యధికంగా డిజిటల్‌ పద్దతిని వినియోగించాలని సూచించింది. మాస్క్‌లు లేకుండా ఎవరిని లోపలికి అనుమతించకూడదని, కేవలం అహార పదార్థాలు సేవించే సమయంలో మాస్కులు విప్పేందుకు అనుమతి ఉంటుందని మార్గదర్శకాల్లో పేర్కొంది. కాగా, కస్టమర్లు వీలైతే మాస్కులతోపాటు గ్లౌస్‌లు, ఇన్‌స్టంట్‌ హ్యాండ్‌ వాష్‌లు వెంట తెచ్చుకోవాలని సూచించాలి. అన్‌లాక్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 50 శాతం సామర్థ్యంతో హోటళ్లు. బార్లు, రెస్టారెంట్లు తెరవాలన్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  గత ఆరు నెలలుగా లాక్‌డౌన్‌ కారణంగా మూసి ఉంచిన బార్లు, రెస్టారెంట్లు సోమవారం నుంచి కిటకిటలాడనున్నాయి.   

ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు.. 
*    కస్టమర్లు వస్తే హోటళ్లు, బార్లు, రెస్టారెంట్ల సిబ్బంది ద్వారాలు తెరవాలి 
*    లక్షణాలు లేని వారిని మాత్రమే లోపలికి అనుమతించాలి.  
*    కస్టమర్ల పేర్లు నమోదు చేయాలి. 
*    అదేవిధంగా ప్రతి కస్టమర్‌కు శానిటైజర్‌ను అందుబాటులో ఉంచాలి.  
*    డబ్బులు తీసుకునే వ్యక్తి తరచూ శానిటైజర్‌ వినియోగించాలి.  
*    శౌచాలయాలు, హ్యాండ్‌ వాష్‌ చేసుకునే స్థలాలను తరచూ పరిశీలించి అక్కడ పరిశుభ్రత ఉండేలా చూడాలి.  
*    సిబ్బందితోపాటు కస్టమర్ల మధ్య వీలైనంత తక్కువగా సంప్రదింపులు ఉండేలా చూడాలి.  
*    సీసీటీవీ కెమెరా పని చేస్తూ ఉండాలి.  
*    సీట్ల సంఖ్య కంటే అధిక కస్టమర్లను అనుమతించకూడదు.. 
*    రెండు టేబుళ్ల మధ్య సురక్షితమైన దూరం ఉండేలా చూడాలి.  
*    టేబుళ్లు, కిచెన్‌ను నిత్యం పరిశుభ్రం చేయాలి.  
*    సిబ్బంది (కార్మికులు)కి టైమ్‌ టు టైమ్‌ వైద్య/ కరోనా పరీక్షలు చేయించాలి. అవసరమైతే కరోనా హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని సంప్రదించాలి.  
*    కూర్చునే ముందు టేబుళ్లపై మెనూ కార్డు, టేబుల్‌ టవల్‌ ఇతర వస్తువులేవి ఉండకూడదు. బట్ట (వస్త్రం) నాప్‌కిన్‌కు బదులుగా యూజ్‌ అండ్‌ త్రో (డిస్పోజల్‌) వస్త్రాన్ని వినియోగించాలి.  
*    క్యూఆర్‌ కోడ్‌ మాదిరిగా మెనూ కార్డు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నించాలి.  
*    సోషల్‌ డిస్టేన్స్‌ ఉంచేందుకుగాను భూమిపై కూడా మార్క్‌లు (గీతలు) చేయాలి.  
*    వీలైతే ఏసీ వినియోగం వద్దు. అవసరమనిపిస్తే ఏసీని తరచూ శుభ్రపరచాలి.  
*    వీలైనంతవరకు వండిన వస్తువుల వివరాలే మెనూ కార్డులో ఉంచాలి.  
ఒక టేబుల్‌పై ఒకే కుటుంబం లేదా ఒక సమూహానికి చెందిన వారినే కూర్చునేందుకు అనుమతించాలి. ఇతరులను అనుమతించకూడదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top