బుల్లి బాయ్‌పై దర్యాప్తు ముమ్మరం

Delhi police are in quest of data from Twitter and GitHub - Sakshi

న్యూఢిల్లీ: ట్విట్టర్‌లో ప్రాచుర్యం పొందిన దాదాపు 100 మంది ముస్లిం మహిళల ఫొటోలను అసభ్యంగా మార్చి, బుల్లి బాయ్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేసి వేలానికి పెట్టిన ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆ యాప్‌ డెవలపర్‌ వివరాలు ఇవ్వాలని యాప్‌కు హోస్టింగ్‌ సేవలందించిన ప్లాట్‌ఫామ్‌ ‘గిట్‌హబ్‌’ను ఢిల్లీ పోలీసులు ఆదేశించారు. దీంతో సంబంధిత యూజర్‌ ఐడీని బ్లాక్‌ చేశామని, దర్యాప్తునకు సహకరిస్తామని గిట్‌హబ్‌ తెలిపింది. ఈ యాప్‌ను తొలిసారిగా ఆన్‌లైన్‌లో ప్రజలకు పరిచయం చేస్తూ ట్వీట్లు చేసిన ‘బుల్లి బాయ్‌’ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాండ్లర్‌ వివరాలను ఇవ్వాలని ట్విట్టర్‌కు పోలీసులు సూచించారు.

ఈ యాప్‌ ద్వారా ఇతరులకు వెళ్లిన అభ్యంతరకర డేటా షేరింగ్‌ను బ్లాక్‌ చేసి తొలగించాలని ఆదేశించారు. ప్రస్తుత బుల్లి బాయ్, గత సలీ డీల్స్‌ వ్యవహారాల్లో ఇప్పటిదాకా జరిగిన అరెస్టుల వివరాలతో తమ ముందు ఆరోతేదీ లోపు హాజరుకావాలని ఢిల్లీ పోలీసులను ఢిల్లీ కమిషన్‌ ఫర్‌ ఉమన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ సోమవారం ఆదేశించారు. మైనారిటీల పట్ల బీజేపీ సర్కార్‌ మానవతా దృక్పథం కొరవడటం వల్లే ఇలాంటి దారుణాలు పునరావృతమవుతున్నాయని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే ఆరోపించారు. ఈ ఘటనలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని బాధిత మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ ఇంతవరకు కనీసం ఒక్క అరెస్ట్‌ కూడా జరగలేదు. మాకు కావాల్సింది న్యాయం. ఎఫ్‌ఐఆర్‌లు కాదు. వికృత చేష్టలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి’ అని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top