కరోనా టీకా పంపిణీ సవాళ్లు ఎన్నో..

Corona Vaccine Should Be Available For Public By April 2021 - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19ను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ఉన్న ఏకైక మార్గం టీకా. ఇప్పటికే పలు కంపెనీలు టీకాలపై ప్రయోగాలు చేపట్టి చివరి దశకు చేరుకున్నాయి. ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా వంటి అంతర్జాతీయ ఫార్మా కంపెనీలతోపాటు భారత్‌ బయోటెక్, రష్యా, చైనాలు కూడా వేర్వేరు టీకాలను సిద్ధం చేశాయి. రష్యా, చైనాలు అత్యవసర పరిస్థితుల్లో కొంతమందిపై ఈ టీకాలను వినియోగించేందుకు అనుమతు లు కూడా ఇచ్చేశాయి. భారత్‌ విషయానికి వస్తే 2 నెలల్లో టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ప్రకటించారు. మరోవైపు భారత్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆస్ట్రాజెనెకా–ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ టీకాను తయారు చేస్తున్న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా మాత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌కు గానీ టీకా సిద్ధం కాదని చెబుతోంది.  (భారత్‌లో హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చేసిందా?)  

ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ టీకా కోవిషీల్డ్‌ మూడో దశ మానవ ప్రయోగ ఫలితాలు డిసెంబర్‌ ఆఖరుకు అంటే క్రిస్మస్‌ నాటికి వెలువడతాయని అంచనా. ఆ తర్వాత ప్రభుత్వ అనుమతులకు మరో ఒకట్రెండు నెలల సమయం పడుతుంది. అంటే ఫిబ్రవరిలో బ్రిటన్‌లో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇదే టీకాపై భారత్‌లోనూ మూడో దశ ప్రయోగాలు మొదలయ్యాయి. మరోవైపు భారత్‌ బయోటెక్‌ టీకా కోవాగ్జిన్‌ మూడో దశ మానవ ప్రయోగాలు రెండ్రోజుల క్రితమే మొదలయ్యాయి. ఇవి పూర్తయ్యేందుకు 56 రోజుల సమయం పడుతుందనుకుంటే వచ్చే ఏడాది జనవరి చివరికల్లా ప్రయోగాలు పూర్తయ్యే అవకాశం ఉంది. మోడెర్నా, ఫైజర్‌ తదితర కంపెనీలు తయారు చేస్తున్న టీకాలను పరిగణనలోకి తీసుకోకపోయినా భారత్‌లో టీకా దొరికేందుకు కనీసం మార్చి తొలివారం వరకూ వేచి చూడక తప్పదన్నమాట.  

కరోనా టీకా పంపిణీ సవాళ్లు ఎన్నో..
►260 కోట్లు: దేశంలోని 130 కోట్ల మందికి కావాల్సిన కరోనా టీకా డోసుల సంఖ్య 
►40–50 కోట్లు: జూలై 2021 నాటికి ప్రభుత్వం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న టీకాల సంఖ్య 
►26–27 కోట్లు: టీకాలను నిల్వ చేసేందుకు కావాల్సిన బాటిళ్లు. స్కాట్‌ కైషా, పిరమల్‌ గ్లాస్, బోరోసిల్, గెరిషైమర్‌ ఇండియా వంటి కంపెనీలు ఇప్పటికే వ్యాక్సిన్‌ బాటిళ్ల ఉత్పత్తిని పెంచాయి. 
►కరోనా టీకాలు ఇచ్చేందుకు అవసరమైన సిరంజీల ఉత్పత్తిని పెంచేందుకు హెచ్‌ఎండీ, ఇస్కాన్‌ సర్జికల్స్, బీడీ వంటి కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.  
►వ్యాక్సిన్లను –20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసేందుకు జీఎంఆర్‌ ఢిల్లీ, హైదరాబాద్‌ విమానాశ్రయాల్లో తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతోంది.  
►స్నోమాన్‌ లాజిస్టిక్స్, బ్లూడార్ట్‌ ఎక్స్‌ప్రెస్, గతి, గుబ్బా కోల్డ్‌ స్టోరేజ్‌ తదితర కంపెనీలు అతిశీతల ఉష్ణోగ్రతల్లో  కరోనా టీకాలను రవాణా చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.  
►అపోలో హాస్పిటల్స్‌ తన ఫార్మసీల ద్వారా టీకాలను పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top