
ఎన్‌సీఆర్‌బీ నివేదిక
మితిమీరిన వేగమే మరణాలకు ప్రధాన కారణం
తెలంగాణలో ట్రాఫిక్ ప్రమాదాల్లో 8,435 మంది మృతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రహదారులు రక్త సిక్తమవుతున్నాయి. ఏటా లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల రూపంలో మృత్యువు ఒడి కి చేరుతున్నారు. 2023 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా జరిగిన వివిధ ట్రాఫిక్ ప్రమాదా ల్లో ఏకంగా 1,97,871 మంది ప్రాణాలు కోల్పోయారని జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. ‘యాసిడెంటల్ డెత్స్–సూసైడ్స్ ఇన్ ఇండియా 2023’పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022తో పోలిస్తే 2023లో మొత్తం ట్రాఫిక్ ప్రమాదాల సంఖ్య 4,72,467 నుంచి 4,91,190కి పెరిగింది. ఈ ప్రమాదాల్లో 4,51,228 మంది గాయపడ్డారు.
రోడ్డు ప్రమాదాలే అధికం
మొత్తం ట్రాఫిక్ ప్రమాదాల్లో అత్యధికం రోడ్డు ప్రమాదాలే ఉన్నాయి. 2023లో 4,64,029 రోడ్డు ప్రమాదాలు జరగగా, వీటిలో 1,73,826 మంది మరణించారు. వీటితో పాటు 24,678 రైల్వే ప్రమాదాల్లో 21,803 మంది, 2,483 రైల్వే క్రాసింగ్ ప్రమాదాల్లో 2,242 మంది చనిపోయారు. రాష్ట్రాల వారీగా చూస్తే, ట్రాఫిక్ ప్రమాద మరణాల్లో ఉత్తరప్రదేశ్ (28,103), తమిళనాడు (20,279), మహారాష్ట్ర (18,879) మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
ఈ మూడు రాష్ట్రాలు కలిపి దేశంలోని మొత్తం ట్రాఫిక్ మరణాలలో 34% వాటాను కలిగి ఉన్నాయి. 2023లో తెలంగాణలో మొత్తం 23,673 ట్రాఫిక్ ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల కారణంగా 8,435 మంది మరణించారు. వీటిలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలే ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 22,903 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా, వీటిలో 7,660 మంది మృత్యువాత పడ్డారు.
అతివేగమే యమపాశం
రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మితిమీరిన వేగమేనని నివేదిక స్పష్టం చేసింది. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 61.4% అంటే 2,84,733 కేసులు అతివేగం వల్లనే జరిగాయి. రోడ్డు ప్రమాద మరణాల్లో 58.6% అంటే, 1,01,841 మంది అతివేగం కారణంగానే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదకరమైన/నిర్లక్ష్యపు డ్రైవింగ్ లేదా ఓవర్ టేకింగ్ కారణంగా 23.7% ప్రమాదాలు, 1,10,064 కేసుల్లో, 41,035 మంది, అంటే 23.6% మరణించారు. మద్యం/డ్రగ్స్ సేవించి వాహనాలు నడపడం వల్ల 3,688 మంది మృత్యువాత పడ్డారు.
ద్విచక్ర వాహనదారులే ఎక్కువ
ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో ద్విచక్ర వాహ నదారులే అత్యధికంగా ఉన్నారు. మొత్తం రోడ్డు ప్రమాద మరణాల్లో 45.8% అంటే 79,533 మంది వీరివే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆ తర్వాత పాదచారులు 15.9%, 27,586 మంది, కారు/జీపు/ఎస్ యూవీ ప్రయాణికులు 14.3%, 24,776 మంది ఉన్నారు.
జాతీయ రహదారులపైనే ఎక్కువ
దేశంలోని మొత్తం రోడ్ల పొడవులో జాతీయ రహదారుల వాటా కేవలం 2.1% మాత్రమే అయినప్పటికీ, అత్యధిక ప్రమాదాలు, మరణాలు ఇక్కడే సంభవిస్తున్నాయి. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 30.3% జాతీయ రహదారులపైనే జరిగాయి. అదేవిధంగా, మొత్తం మరణాలలో 34.6% అంటే 60,127 ఈ రహదారులపైనే నమోదయ్యాయి. దీని తర్వాత రాష్ట్ర రహదారులపై 23.4% మరణాలు అంటే 40,611 సంభవించాయి. ప్రమాదాలు ఎక్కువగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య జరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. ఈ గణాంకాలు రహదారి భద్రతా నియమాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని, ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయి.
ప్రమాదాల ముఖచిత్రం (2023)
మొత్తం ట్రాఫిక్ ప్రమాదాలు 4,91,190
మొత్తం మరణాలు 1,97,871
రోడ్డు ప్రమాద మరణాలు 1,73,826
అతివేగంతో మరణాలు 1,01,841
ద్విచక్ర వాహనదారుల మరణాలు 79,533