కనులపండువగా ప్రభోత్సవం
● పడమటి అంజన్న బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన భక్తజనం
మక్తల్: మక్తల్ పడమటి ఆంజనేయ స్వామివారి బ్రహ్మోత్సవాల భాగంగా బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ప్రభోత్సవ వేడుకలు కనులపండువగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన ప్రభోత్సవ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలోని రాంలీలా మైదానం కిటకిటలాడింది. ముందుగా ఆలయ చైర్మన్ ప్రాణేష్‌కుమార్ తదితరులు ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. తరువాత స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ప్రతిష్టించి పట్టణంలోని మెయిన్ రోడ్‌లో ఉన్న గోధా ఆంజనేయ స్వామి దేవాలయం వరకు భజన బృందాల నడుమ పల్లకీ యాత్ర నిర్వహించారు. భక్తులు, ప్రముఖులు ప్రభోత్సవానికి హారతులు పట్టి కొబ్బరికాయలు కొట్టారు. ప్రభోత్సవాన్ని పడమర దిక్కున ఉన్న చిన్న ఆంజనేయ స్వామి దేవాలయం వరకు లాగారు. అక్కడ విశేష పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి ఆలయం వద్దకు ప్రభోత్సవాన్ని తీసుకువచ్చారు.
భక్తిశ్రద్ధలతో పవమాన హోమం
ఉత్సవాల సందర్భంగా బుధవారం ఉదయం ఆలయంలో పవమాన హోమాన్ని వేదపండితులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ఆలయ చైర్మన్ ప్రాణేష్‌కుమార్ పవమాన హోమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఈఓ కవిత వేదపండితులు పాల్గొన్నారు.


