దివ్యాంగుల సాధికారతే లక్ష్యం
నారాయణపేట: దివ్యాంగుల సాధికారతే లక్ష్యంగా పనిచేయాలని.. వారితో ఆత్మీయంగా మెలగాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధ్యక్షతన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను నిర్వహించగా.. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమం అభివృద్ధికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి అన్ని రంగాల అభివృద్ధికై పనిచేస్తున్నామన్నారు. జిల్లాలో దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ఇక నుంచి ప్రతినెలా చివరి శనివారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో దివ్యాంగుల సమస్యలపై వినతులు స్వీకరించడం జరుగుతుందన్నారు. దివ్యాంగులు తమకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, సంక్షేమ పథకాలపై అవగాహన లేకపోవడంతో దరఖాస్తు చేసుకోవడం లేదన్నారు. యూడీఐడీ కార్డులకు గాను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దివ్యాంగుల స్వయం సహాయ సంఘాలు ఏర్పాటు చేసుకోవడంతో వడ్డీలేని రుణాలు వస్తాయన్నారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి, సామాజిక భద్రత రంగాల్లో సేవలు అందించేందుకు అంకితభావంతో పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఆర్‌డీఓ మొగులప్ప అన్నారు. క్రీడాపోటీల్లో విజేతలుగా నిలిచిన దివ్యాంగ క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ర్యక్రమంలో డీఎంహెచ్‌ఓ జయ చంద్రమోహన్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి, సీడీపీఓ జయ తదితరులు పాల్గొన్నారు.


