
గోడు వినేదెవరు..?
గోపాలమిత్రలకు వేతనాలు అందక ఇబ్బందులు
● తొమ్మిది నెలలుగా ఇదే దుస్థితి
● ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో
మొత్తం 214 మంది గోపాలమిత్రలు
మరికల్: మారుమూల పల్లెలు.. పశువైద్యశాలలు అందుబాటులో లేని పల్లెల్లో పాడి రైతుల ఇంటి ముంగిట్లో అత్యవసర సేవలు అందిస్తూ.. పశువులకు సంబంధించిన సీజనల్ వ్యాధులపై వాటి యజమానులను అప్రమత్తం చేస్తూ.. పశువులకు అత్యవసర చికిత్సలు చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు గోపాలమిత్రలు. ప్రస్తుతం వారి పరిస్థితి దయనీయంగా మారింది. తొమ్మిది నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. నిత్యం గ్రామాలను తిరుగుతూ క్షేత్రస్థాయిలో పాడి రైతులకు సేవలందించడంతోపాటు ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ, సామాజిక కార్యక్రమాల్లో సైతం గోపాలమిత్రలు భాగస్వామ్యం అవుతున్నారు. కానీ వీరి గోడు మాత్రం ఎవరూ వినడం లేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. తొమ్మిది నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 214 మంది గోపాలమిత్రలు ఉన్నారు. వీరంతా వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా నెట్టుకొస్తున్నారు.
పశువైద్యంలో కీలకపాత్ర
వ్యవసాయ అనుబంధంగా పాడి రంగంలో మేలు జాతి ఆవులు, గేదెల పునరుత్పత్తి, పాల ఉత్పత్తి, ఉత్పాదక పెంపు లక్ష్యంగా గోపాలమిత్ర వ్యవస్థ ఏర్పాటైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 2.50 లక్షలకు పైగా పశువులు ఉండగా 214 మంది గోపాలమిత్రలు సేవలు అందిస్తున్నారు. పశువులకు కృతిమ గర్భధారణ చేయడంతోపాటు మేకలు, గొర్రెలకు వీరు ప్రాథమిక వైద్యం అందిస్తున్నారు. అలాగే పశువులకు టీకాలు, నట్టలు, గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయడంలో గోపాలమిత్రల పాత్ర కీలకం. ఒక్కొక్కరికి నెలకు గౌరవ వేతనంగా రూ.11,050 చెల్లిస్తున్నారు.
బడ్జెట్ రావాల్సి ఉంది
గోపాల్‌మిత్రలకు సంబంధించి 9 నెలల వేతనాలు రావాల్సి ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. బడ్జెట్ విడుదల కాగానే వారి ఖాతాల్లో వేతనాలు జమ చేస్తాం.
– మధుసూదన్‌గౌడ్, జేడీ, మహబూబ్‌నగర్
లక్ష్యాన్ని చేరుకోలేదంటూ..
పశువుల సంఖ్య మేరకు గోపాలమిత్రలకు కృతిమ గర్భధారణ లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు. ఒక్కో గోపాలమిత్ర నెలకు 100 పశువులకు కృతిమ గర్భధారణ చేయాలి. కానీ గ్రామీణ ప్రాంతాలు కావడంతో పాడి రైతులు సహజ గర్భధారణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో వీరు లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. ఇదే కారణం చూపుతూ అధికారులు గోపాలమిత్రల వేతనాల్లో కోతలు విధిస్తున్నారు. అసలే అంతంత మాత్రంగా వచ్చే వేతనాల్లో.. కోత విధించడంతో మేం ఎలా బతికేది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు నెల నెల వేతనాలు చెల్లించకపోవడంతో అప్పులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి వస్తోందని వాపోతున్నారు. ఈ విషయంపై పలువురు గోపాలమిత్రలు తమ ఇబ్బందులను మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా వేతనాలు విడుదల చేసేలా చూడాలని కోరుతున్నారు.

గోడు వినేదెవరు..?