
గన్నీ బ్యాగుల కొరత తీర్చండి
మాగనూర్: వరికోతలు పూర్తయి నెలరోజులు గడుస్తున్నా.. నేటికీ సరిపడా గన్నీ బ్యాగులు అందించడం లేదని మండలంలోని నేరడగం రైతులు కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ని కలిసి విన్నవించారు. ఆమె ఆదేశాల మేరకు శనివారం అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సివిల్ సప్లయ్ అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈక్రమంలో రైతులు మాట్లాడుతూ.. పంట వేసిన తర్వాత అధికారులు సర్వే చేశారని, వచ్చే దిగుబడికి ఎన్ని సంచులు అవసరం అవుతాయో వారికి తెలియదా నిలదీశారు. గన్నీ బ్యాగుల సరఫరాలో వారి నిర్లక్ష్యం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామానికి సరఫరా చేసిన గన్నీ బ్యాగుల వివరాలలో అవకతవకలు ఉన్నట్లు గుర్తించామని, ప్రస్తుతానికి 20 వేల గన్నీ బ్యాగులు గ్రామానికి వచ్చాయని, ఆదివారం వరకు మరో 70 వేల వరకు అందిస్తామన్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లై డీఎం సైదులు, డీఏఓ జాన్‌సుధాకర్, ఎంపీడీవో రహ్మతుద్ధీన్, ఇంచార్జీ తహసీల్ధార్ సురేష్‌కుమా తదితరులు పాల్గొన్నారు.