
అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
నారాయణపేట: ప్రజల అంచనాలకు అనుగుణంగా అధికారులు సమర్థవంతంగా పనిచేసి అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు ఆదేశించారు. గురువారం ఆయన జిల్లాలో పర్యటించారు. ముందుగా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్, స్థానిక సంస్థల జిల్లా అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డితో కలిసి జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ వైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మరోవైపు అవసరమైన పనులను కొనసాగించి బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగడం ద్వారా ఏ ప్రాంతమైన, జిల్లా, రాష్ట్రమైనా అభివృద్ధి సాధిస్తుందన్నారు. సీఎం సొంత జిల్లా అయిన పేటలో చేయాల్సింది చాలా ఉందని, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా చేసిన అభివృద్ధి కంటికి కనబడాలి, ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలన్నారు.
‘భూ భారతి’ని పకడ్బందీగా అమలు చేయాలి
భూ భారతి చట్టాన్ని పకడ్బందీగాగా అమలు చేయాలని, రైతుల నుంచి ఎలాంటి నిరాశ ఎదురు కావొద్దని, చట్టం ప్రకారం ఏది చేస్తారో ఏది ఏయారో రైతులకు వివరించి అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలోని పైలెట్ మండలాల్లో భూ సమస్యలకు చూపించిన పరిష్కారం అన్ని మండలాలకు వర్తిస్తుందని, రాష్ట్రమంతటా అమలు చేసేందుకు దిక్సూచి అని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హుల ఎంపిక పారదర్శకంగా చేయాలని, నిధుల సమస్య లేదన్నారు. జిల్లా నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సేకరణ ప్రక్రియను వేగిరం చేయాలని, ఆ పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. అనంతరం పదో తరగతి ఫలితాలు మరింత మెరుగవ్వాలని, ఎఫ్‌ఎల్‌ఎన్ మంచి కార్యక్రమం అని, ఢిల్లీ, రాజస్థాన్ పాఠశాలలో విద్యా బోధనను పరిశీలిస్తే మనం ఏంచేయాలో తెలుస్తుందన్నారు. కడా అభివృద్ధి పనులపై శాఖల వారీగా చర్చించి వాటిని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా సమీక్షలో పంటల సాగు, సన్న బియ్యం పథకం, యువ వికాసం తదితర పథకాల ప్రగతిపై ఆరా తీశారు.
ప్రజల ఆకాంక్షలకు
అనుగుణంగా ముందుకెళ్లాలి
భూ భారతి పైలెట్ మండలాలేరాష్ట్రానికి దిక్సూచి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు