
‘భూ భారతి’ దరఖాస్తులపై విచారణ చేపట్టాలి
మద్దూరు: భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శనివారం మద్దూరు తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతిలో వచ్చిన దరఖాస్తుల పరిశీలనపై ప్రత్యేకాధికారి యాదగిరి, ఆర్డీఓ రాంచందర్‌నాయక్‌తో కలిసి సమీక్షించారు. తిరస్కరిస్తున్న దరఖాస్తులపై ఖచ్చితమైన స్పష్టత ఉండాలని, వాటిని ఎందుకు తిరస్కరించామనే కారణాన్ని రైతులకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెలాఖరు నాటికి వంద శాతం దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు. చట్టం ప్రకారం భూ సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులదేనని, విరాసత్ దరఖాస్తుల పరిష్కారం నిబంధలను అనుసరించాలన్నారు. పైలెట్ మండలంలో భూ సమస్యలకు అధికారులు చూపించే పరిష్కారాలే.. కొత్తగా ఎంపిక చేసే ఫైలెట్ మండలాల్లో వర్తింపచేసే అవకాశం ఉంటుందని అన్నారు. ఒకటికి రెండు సార్లు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో మద్దూరు, కొత్తపల్లి, కోస్గి తహసీల్దార్లు మహేష్‌గౌడ్, జయరాములు, బక్క శ్రీనివాస్, దయాకర్‌రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.