దేవస్థాన చైర్మన్, ఈఓతో భక్తుల వాగ్వాదం
కార్తీకమాసం పురస్కరించుకుని శివమాలను స్వీకరించిన శివదీక్షా భక్తులు ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు శ్రీశైల మహాక్షేత్రంలో దీక్ష విరమణ చేసేందుకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో శివదీక్షా భక్తులు జ్యోతిర్ముడితో శ్రీశైల మల్లన్న దర్శనానికి బారులు తీరుతున్నారు. సోమవారం శివదీక్షా విరమణకు వచ్చిన భక్తులు సైతం తమకు మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పించాలని ఆలయ ధ్వజస్తంభం, మనోహరగుండం వద్ద ధర్నాకు దిగారు. దీంతో జ్యోతిర్ముడి కలిగిన శివదీక్షా భక్తులకు స్వామివారి స్పర్శదర్శనాన్ని కల్పించారు. ఈ నెల 1న ఆన్‌లైన్‌లో స్పర్శదర్శన టికెట్ల కోటాను దేవస్థానం విడుదల చేసింది. ఈ క్రమంలో క్యూలైన్లలో, కంపార్ట్‌మెంట్లలో ఉన్న భక్తులకు సరైన సౌకర్యాలు కూడా లేకపోవడంతో భక్తులు దేవస్థాన ట్రస్ట్‌బోర్డు చైర్మన్, ఈఓ, ధర్మకర్తల మండలి సభ్యులతో వాగ్వాదానికి సైతం దిగారు. దీంతో మంగళవారం నుంచి సామాన్య భక్తులకు స్వామి వారి అలంకార దర్శనం, జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు ప్రతి రెండు గంటలకు ఒకసారి స్పర్శదర్శనం కల్పిస్తున్నారు.


