‘ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి రండి’
నందికొట్కూరు: మున్సిపల్ కమిషనర్ బేబి ఉద్యోగం వదిలేసి రాజకీయాలు చేస్తే స్వాగతిస్తామని మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్‌రెడ్డి హితవు పలికారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని హజినగర్, మారుతీనగర్ పేద ప్రజలకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ.10 లక్షలు ఎంపీ నిధులు మంజూరైతే ప్రభుత్వ స్థలం ఉన్నా లేవని జిల్లా అధికారులకు తప్పుడు నివేదిక పంపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లా అధికారులు వస్తే ప్రభుత్వ స్థలాలు చూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సంగయ్యపేట, సుబ్బారావుపేట, బైరెడ్డి నగర్, విద్యానగర్, ఎస్‌ఎస్‌ఆర్ నగర్, హౌసింగ్ బోర్డు కాలనీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లకు స్థలం కేటాయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మున్సిపల్ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా అధికారులు వ్యవహరించడం తగదన్నారు. పట్టణ ప్రజలకు ఉపయోగపడే కమ్యూనిటీ హాల్, హెల్త్ సెంటర్లకు స్థలాలు లేవని నిధులు వెనక్కి పంపిన కమిషనర్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. కమిషనర్ స్పందించి ప్రభుత్వ స్థలాలు చూపించాలని, లేని పక్షంలో కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టడం ఖాయమని హెచ్చరించారు. సమావేశంలో కౌన్సిలర్లు లాలు, చాంద్‌బాషా, తదితరులు పాల్గొన్నారు.


