సామాన్య భక్తులకు స్పర్శ దర్శనాలు రద్దు
● శివ స్వాముల రద్దీతో వారం రోజుల పాటు నిలిపివేత ● సమాచారం ఇవ్వని దేవస్థానం.. అయోమయంలో భక్తులు ● చైర్మన్, ఈఓతో జ్యోతిర్ముడి భక్తుల వాగ్వాదం ● జ్యోతిర్ముడి భక్తులకు రెండు గంటలకోసారి స్పర్శదర్శనం
శ్రీశైలంలో జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఏ రోజు ఏ సేవ ఉంటుందో తెలియక భక్తులు అయోమయానికి గురవుతున్నారు. వారం రోజుల పాటు సామాన్య భక్తులకు మల్లన్న స్పర్శదర్శనాలు రద్దు చేశారు. ఈ విషయంపై దేవస్థానం కనీసం పత్రికా ప్రకటన కూడా విడుదల చేయకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం మల్లన్న స్పర్శదర్శనం టికెట్లను పూర్తిగా ఆన్‌లైన్ చేసింది. సిఫా రసు లేఖలకు మాత్రమే వసతి విభాగ అధికారులు కరెంట్ బుకింగ్ ద్వారా స్పర్శదర్శనం టికెట్లను మంజూరు చేస్తారు. మంగళవారం స్పర్శదర్శనం టికెట్ల కోటాను దేవస్థానం విడుదల చేయలేదు. అలాగే సిఫార్స్ లేఖలకు వసతి విభాగం నుంచి ఇచ్చే స్పర్శదర్శనాల టికెట్లను సైతం 7వ తేదీ వరకు రద్దు చేసినట్లు తెలుస్తోంది. సామాన్య భక్తులకు ఏడు రోజుల పాటు మల్లన్న స్పర్శదర్శనం చేసుకునే అవకాశం లేదు. క్షేత్రానికి జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములు అధికసంఖ్యలో తరలివస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థాన అధికారులు పేర్కొన్నారు. అయితే ఏటా కార్తీకమాసం అనంతరం జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు స్పర్శదర్శనం కలిస్తారు. అదే విధంగా ఈ ఏడాది ముందుగానే ఎందుకు చర్య లు తీసుకోలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆన్‌లైన్‌లో స్పర్శదర్శనం టికెట్ల కోటాను ఎందుకు విడుదల చేయలేదో భక్తులకు అర్థం కానీ పరిస్థితి నెలకొంది. దేవస్థాన అధికారుల అనాలోచిత నిర్ణయాలతో భక్తులు గందరగోళానికి గురవుతున్నా రు. స్పర్శ దర్శనం కోసం వచ్చిన సాధారణ భక్తులు దేవస్థానం అధికారుల తీరుపై మండిపడుతున్నారు.


