
విలీనం వద్దు.. మా బడే ముద్దు
ఆళ్లగడ్డ: ‘విలీనం వద్దు.. మా బడే ముద్దు’ అంటూ విద్యార్థులు పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. ఈ ఘటన బుధవారం జి.జమ్ములదిన్నెలో చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ మండలం ఎస్సీకాలనీలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇందులో 30 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మోడల్ స్కూల్ పేరుతో కూటమి ప్రభుత్వం పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 30 మంది 3, 4, 5 తరగతుల విద్యార్థులను గ్రామంలోని మెయిన్ ప్రథమిక పాఠశాలకు తరలించారు. దీనిపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. పాఠశాలను విలీనం చేయవద్దని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కాలనీలోని ప్రధాన రోడ్డు నుంచి పాఠశాల వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ‘మా బడి మాకు కావాలి’ అని విద్యార్థులు పలకలపై రాసుకుని ప్రదర్శించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ రోజు వారి కూలి పనులు చేసుకునే తాము ఉదయాన్నే వెళ్లాలని, పిల్లలను దూరంగా ఉండే మరో పాఠశాలకు పంపాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు వెళ్లి రావాలంటే మెయిన్ రోడ్డు దాటుకుని వెళ్లాలని, ఈ ఇరుకు దారిలో ప్రమాదకరమైన పాడుబడ్డ బావి కూడా ఉందని ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలను యథావిథిగా కొనసాగించకుంటే తమ పిల్లలను ఇంటి దగ్గరే ఉంచుకుంటామని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలను యథవిథిగా కొనసాగించాలని హెచ్‌ఎంకు వితని పత్రం సమర్పించారు.
విద్యార్థుల ఆందోళన