
స్టాంపుల కొరత.. క్రయవిక్రయాలకు అవస్థ
కర్నూలు(సెంట్రల్: జిల్లాలో స్టాంపుల కొరత తీవ్రంగా ఉంది. నాన్ జ్యుడీషియల్ స్టాంపులు అందుబాటులో లేకపోవడంతో క్రయ, విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదే క్రమంలో ఈ–స్టాంపులకు డిమాండ్ ఉండడంతో వెండర్లు వాటిని మూడు, నాలుగు రెట్లు పెంచి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. అయినా రిజిస్ట్రేషన్ శాఖాధికారులు తమకేమి సంబంధంలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలకు వస్తున్నాయి.
అధిక ధరలకు విక్రయం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వాటి పరిధిలో రిజిస్ట్రేషన్లకు వినియోగించే నాన్ జ్యుడీషియల్ స్టాంపులు అందుబాటులోలేవు. ఇందుకు ప్రధాన కారణం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో కావాల్సినన్నీ అందుబాటులో ఉంచకపోవడమే. దీంతో పూర్తిగా ఈస్టాంపులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో వెండర్లు రేట్లు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. రూ.10 స్టాంపును రూ.40లకు, రూ.20 స్టాంపును రూ.50 లకు, రూ.50 స్టాంపును రూ.100, స్టాంపు రూ.160 వరకు అధికంగా అమ్ముకుంటున్నారు. దీంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఎవరైనా ఎక్కువ రేట్లకు ఎందుకు అమ్ముతున్నారంటే వారికి స్టాంపులు ఇవ్వడంలేదు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే జిల్లా రిజిస్ట్రార్ అందుబాటులో ఉండడంలేదు. ప్రస్తుతం రెగ్యులర్ జిల్లా రిజిస్ట్రార్ లేకపోవడంతో నంద్యాల జిల్లా రిజిస్ట్రార్ జానకీదేవి విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపుల విక్రయించే బుకింగ్ పాయింట్ నాలుగైదు నెలల నుంచి మూత పడింది. ఇటీవల అక్కడ పనిచేస్తున్న ఉద్యోగిని ఏసీబీ అక్రమ కేసులో ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉన్నా ఎవరినీ నియమించకపోవడంతో ఏకంగా స్టాంపుల విక్రయ స్టాల్‌నే మూసివేశారు.
మూతపడిన స్టాంపుల కౌంటర్
జిల్లాలో అన్ని రకాల స్టాంపుల కొరత నెలకొంది. నాన్ జ్యుడీషియల్ స్టాంపులు అస్సలు అందుబాటులో లేకపోవడంతో ఈస్టాంపులతో వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. అయితే బ్యాంకులు వినియోగించే ఫ్రాంక్లిన్ స్టాంపులు, రెవెన్యూ, కోర్టు, స్పెషల్ అదెసివ్ స్టాంపుల కొరత తీవ్రంగా ఉంది. ఇందులో రెవెన్యూ స్టాంపులు పోస్టాఫీసుల్లో కూడా అందుబాటులో ఉంటాయి. మిగిలిన అన్ని రకాల స్టాంపులను జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయమే ప్రజలకు అందుబాటులో ఉంచాల్సి ఉంది. అయితే వారు పట్టించుకోకపోవడంతో ఉన్న వాటిని వెండర్లు అధిక ధరలకు అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. ఈ స్టాంపుల విక్రయాలకు సంబంధించిన కౌంటర్‌ను మూసి వేశారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా అడిగితే మాత్రం తమ దృష్టి రాలేదని, పరిశీలన చేసి విక్రయదారులకు ఇబ్బంది లేకుండా చూస్తామని అధికారులు చెప్పడం విశేషం.
కృత్రిమ కొరత
కర్నూలు, నంద్యాల, అనంతపురం, ప్రకాశం జిల్లాల(మార్కాపురం నియోజకవర్గం) కు సంబంధించిన ఈ–స్టాంపింగ్ స్టాక్ హోల్డర్ ఈస్టాంపులను సక్రమంగా సరఫరా చేయకుండా అప్పుడప్పుడు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. క్రయ, విక్రయాదారులకు అవసరమైన ఈ–స్టాంపులను గుర్తింపు పొందిన వెండర్లకు సరఫరా చేయాల్సి ఉన్నా చేయడంలేదు. ఇందుకు ఆయన వెండర్లకు ఓ షరతు పెడుతున్నారు. తన ఖాతాలో రిజిస్ట్రేషన్లకు వినియోగించే చలాన్లను వినియోగదారుల ద్వారా చెల్లించేలా చేస్తేనే ఈ స్టాంపులను ఇస్తానని చెబుతున్నట్లు వెండర్లు వాపోతున్నారు. ఫలితంగా ఆయన సమయానికి ఈస్టాంపులను ఇవ్వకపోవడంతో అనుకోకుండా కొన్ని సార్లు కొరత నెలకొంటోంది. ఆ సమయంలో స్టాంపులు ఉన్న వెండర్లు అధిక ధరలకు అమ్ముకుంటున్నారు.
అందుబాటులో లేని
నాన్ జ్యుడీషియల్, రెవెన్యూ, బ్యాంకు,
కోర్టు స్టాంపులు
ఈ–స్టాంపులను రేటు పెంచి
అమ్ముతున్న వెండర్లు
మూడు నెలలుగా స్టాంపుల
విక్రయ కౌంటర్ మూసివేత
పట్టించుకోని రిజిస్ట్రేషన్ శాఖ
అధికారులు