
ఆళ్లగడ్డ డీఈ రవికాంత్ చౌదరి అరెస్ట్
నంద్యాల: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆళ్లగడ్డ ఎలక్ట్రికల్ డీఈ రవికాంత్ చౌదరిని కర్నూలు ఏసీబీ డీఎస్పీ సోమన్న బుధవారం అరెస్ట్ చేశారు. నంద్యాల పట్టణంలోని రైతునగరంలో ఉన్న రవికాంత్ చౌదరి ఇంటితో పాటు వారి బంధువుల ఇళ్లు, హైదరాబాద్, బెంగుళూరు వంటి ప్రదేశాల్లో ఏకంగా 17 చోట్ల ఏసీబీ అధికారులు టీంలుగా ఏర్పడి సోదాలు చేశారు. ఈ సోదాల్లో భారీగా స్థిరాస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సోమన్న మాట్లాడుతూ.. ఈ ఏడాది మే 16వ తేదీన రుద్రవరం మండలం చిన్నకంబలూరుకు చెందిన రామకృష్ణాచారి నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటున్న విషయంలో విద్యుత్ డీఈ రవికాంత్ చౌదరి, అతని ప్రైవేటు అసిస్టెంట్ ప్రతాప్‌లను అరెస్ట్ చేశామన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఇతనిపేరుపై ఉన్న లాకర్ నుంచి 2 కేజీల 820 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకొని కోర్టుకు జమ చేశామన్నారు. ఆ సమయంలో అతని ఇంట్లో సోదాలు చేయగా డాక్యుమెంట్లు కొన్ని లభించాయని, వాటిని పరిశీలించగా రవికాంత్ చౌదరికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. దీంతో రవికాంత్ చౌదరిపై ఆదాయానికి మించి ఆస్తులు కేసు నమోదు చేసి అతని ఇల్లు, వారి బంధువుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో దాడి చేశామన్నారు. ఈ దాడిలో అనేక స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభించాయన్నారు. డీఈ జీతం, ఇతడు సంపాదించిన ఆస్తులు పరిగణలోకి తీసుకొని ఆదాయానికి మించి ఆస్తులు ఉండటంతో అరెస్ట్ చేశామన్నారు.
ఆదాయానికి మించి ఆస్తులు
ఉన్నాయని ఏసీబీ అధికారులు సోదాలు
భారీగా స్థిరాస్తి పత్రాలు స్వాధీనం