
తిరుపతికి ప్రత్యేక రైలు.. అయినా ఆగదు!
మరో డెమూ రైలు
నడపాలి
నంద్యాల నుంచి రేణిగుంట వరకు ప్రస్తుతం ఒకే డెమూ రైలు నడుస్తోంది. ఈ రైలు ఉదయం 6.45 గంటలకు కోవెలకుంట్లకు చేరుకుంటుంది. ఈ రైలు వెళ్లిన తర్వాత రాత్రి వరకు రైళ్ల రాకపోకలు లేవు. ఇదే సమయంలో రేణిగుంట నుంచి నంద్యాలకు మరో డెమూ రైలు నడిపితే ప్రయాణికులకు అన్ని విధాలా రైలు ప్రయాణం ఉపయోగకరంగా ఉంటుంంది. జూలై నెల నుంచి నంద్యాల మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలు నడవనుంది. ఈ రైలుకు బనగానపల్లె, కోవెలకుంట్ల, ప్రొద్దుటూరు పట్టణాల్లో స్టాపింగ్ కల్పిస్తే ప్రయోజనకంగా ఉంటుంది.
– డీసీ ఉసేన్, కోవెలకుంట్ల
తిరుగు ప్రయాణంలో
తిప్పలు
నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో పగటి వేళల్లో రైళ్ల రాకపోకలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. వివిధ పనుల నిమిత్తం ఉదయమే జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కడప, తదితర ప్రాంతాలకు వెళ్లి మధ్యాహ్నానికే పనులు పూర్తి చేసుకున్నా తిరుగు ప్రయాణంలో రైలు వసతి లేదు. దీంతో బస్సు, ఇతర వాహనాల్లో రోడ్డు మార్గాన స్వగ్రామానికి చేరాల్సి వస్తోంది. దీనివల్ల అనేక వ్యయ ప్రయాసలు తప్పడం లేదు. ఒకటి,
రెండు రైళ్లు పగటి వేళల్లో నడిపితే రైలు ప్రయాణం సులభతరంగా ఉంటుంది.
– రఘునాథరెడ్డి, గుళ్లదూర్తి,
కోవెలకుంట్ల మండలం
తొమ్మిదేళ్లు గడిచినా పట్టాలెక్కని కొత్త రైళ్లు
● నంద్యాల– ఎర్రగుంట్ల మార్గంలో
రైళ్ల కొరత
● రోజుకు రాకపోకలు సాగించేది
ఆరు మాత్రమే
● పగటి పూట డెమూ ఒక్కటే!
● తిరుగు ప్రయాణంలో వాహనాల్లోనే!
కోవెలకుంట్ల రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కుతున్న ప్రయాణికులు
తొమ్మిదేళ్ల నుంచి
ఆరు రైళ్లు మాత్రమే..
కేంద్ర మాజీ హోం సహాయమంత్రి, బీహార్, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేసిన సంజామల వాసి దివంగత పెండేకంటి వెంకటసుబ్బయ్య కలల సాకారమైన నంద్యాల– ఎర్రగుంట్లరైల్వే మార్గం ప్రారంభించి తొమ్మిదేళ్లు గడుస్తున్నా మరిన్ని రైళ్ల రాకపోకల ప్రతిపాదన మరుగున పడింది. 2016లో ఈ మార్గం ప్రారంభం అయినా ఇప్పటి వరకు కేవలం రాక, పోక ఆరు రైళ్లు మాత్రమే తిరుగుతున్నాయి. రాకపోకలు ప్రారంభమైన మొదట్లో నంద్యాల నుంచి కడప వరకు వారంలో ఆరు రోజులు డెమూ రైలు నడిచేది. తర్వాత ఆరు నెలలకు ధర్మవరం నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి వారంలో మూడు రోజుల మాత్రమే ఎక్స్‌ప్రెస్ రైలు తిరిగేది. 2018వ సంవత్సరం నుంచి డెమూ రైలును వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి వరకు పొడిగించడంతోపాటు ఎక్స్‌ప్రెస్ రైలుతో సహా రెండు రైళ్లు ప్రతి రోజు నడిచేలా రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. వీటితో పాటు రెండేళ్ల క్రితం నుంచి తిరుపతికి ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తోంది.
కోవెలకుంట్ల: రైలు ప్రయాణం అంటే భత్రతతో పాటు చార్జీలు తక్కువని పేద, మధ్య తరగతి ప్రజలు అధిక శాతం రైళ్లలో ప్రయాణిస్తారు. అయితే నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గం ప్రారంభించి తొమ్మిదేళ్లు అవుతున్నా నేటికి రైళ్ల పెంపు నామాత్రంగా ఉండటంతో నంద్యాల, వైఎస్సార్ జిల్లాల ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి కర్నూలు– వైఎస్సార్ జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు నంద్యాల నుంచి వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల వరకు 130 కి.మీ మేర రైల్వేలైన్ ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం, సంజామల, కోవెలకుంట్ల, బనగానపల్లె, మద్దూరు, నంద్యాల రైల్వేస్టేషన్లు ఉన్నాయి. రెండు జిల్లాల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2016 ఆగస్టు నుంచి ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. నంద్యాల నుంచి చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు డెమూ, అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగా మచిలీపట్నం వరకు, గుంటూరు నుంచి తిరుపతికి ప్రతి రోజు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ఆయా జిల్లాల పారిశ్రామిక అభివృద్ధికి గూడ్స్ రైళ్లు తిరుగుతున్నాయి. ప్రయాణికులకు రైలు ప్రయాణం మరింత సులభతరం చేసేందుకు రూ. 50 కోట్లతో విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారు. 2023 మార్చి 29వ తేదీ నుంచి ఈ మార్గంలో విద్యుత్ రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం రోజుకు రాక,పోక ఆరు రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైళ్ల రాకపోకలను పెంచాలని రెండు జిల్లాల ప్రజలు కోరుతున్నా రైళ్ల శాఖ అధికారులు విస్మరిస్తున్నారు.
పగటి వేళలో కలగా రైళ్ల రాకపోకలు
డెమె రైలు మినహా మిగిలిన రైళ్ల రాకపోకలన్నీ రాత్రి వేళల్లో కొనసాగుతుండటంతో రెండు జిల్లాల ప్రయాణికులకు రైలు ప్రయాణం సౌలభ్యంగా లేదు. పగటి వేళల్లో రైళ్ల రాకపోకలు కలగా మిగిలాయి. నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో విద్యార్థులు, ఉద్యోగులతోపాటు ఆయా జిల్లాల్లోని వివిధ ముఖ్య పట్టణాలకు బస్సు ప్రయాణం కంటే రైలు ప్రయాణం దగ్గరి మార్గం. అలాగే ఆయా పట్టణాల్లో బంగారు ఆభరణాలు, పట్టుచీరెలు, వస్త్ర, తదితర వ్యాపార నిమిత్తం ప్రజలు, వ్యాపారాలు రైలు ప్రయాణం సాగిస్తున్నారు. ప్రతి రోజు బోగీల్లో సీట్లు నిండి నిలబడి ప్రయాణం సాగిస్తున్నారు. ఈ మార్గంలో నంద్యాల నుంచి ఉదయం 6 గంటల రైలు వెళ్లిన తర్వాత రాత్రి వరకు రైళ్ల రాకపోకలు లేవు. తిరుగు ప్రయాణంలో సైతం రాత్రి వరకు రైలు సౌకర్యం లేకపోవడంతో ఉదయం వివిధ పనుల నిమిత్తం వెళ్లిన ప్రయాణికులు తిరుగు ప్రయాణంలో రోడ్డు మార్గంలో బస్సులు, ఇతర వాహనాల్లో స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. నిత్యం వందల మంది ప్రయాణికులు రైలు మార్గం ద్వారా రాకపోకలు సాగిస్తున్నా రైల్వే అధికారులు పగటి వేళలో రైళ్లను నడపకపోవడం విచారకరం.
కనెక్టివిటీ ప్రతిపాదన రద్దు
ఉత్తర భారదేశానికి రైలు కనెక్టివిటీని విస్తరించేందుకు 2020వ సంవత్సరం నుంచి ఈ మార్గంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు నడపాలని ప్రతిపాదన ఉండేది. ఆ ఏడాది కరోనా వైరస్ విజృంభించడంతో ఆ ప్రాతిపాదనను రైల్వే అధికారులు రద్దు చేశారు. తిరిగి ఈ ప్రతిపాదనపై రైల్వే శాఖ దృష్టి సారించలేదు. తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలును కడప నుంచి నంద్యాల వరకు పొడిగించాలని ప్రతిపాదన ఉన్నా రెండు నెలల క్రితం ఆ రైలును నంద్యాలకు కాకుండా అనంతపురం జిల్లా గుంతకల్లు వరకు పొడిగించడంతో ఈ ప్రాంత ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. ఈ నెల నుంచి నడిచే ప్రత్యేక రైలు సైతం వారానికి ఒకసారి మాత్రమే నడవనున్నా ఏమాత్రం ఉపయోగకరంగా లేదు. రైల్వేశాఖ అధికారులు ఈ మార్గంలో పగటి వేళ్లలో రైళ్ల రాకపోకలు నడిచేలా చర్యలు తీసుకోవాలని రెండు జిల్లాల ప్రయాణికులు కోరుతున్నారు.
ప్రస్తుతం నడుస్తున్న ప్యాసింజర్, రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు ఈ నెలనుంచి నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు నడపనుంది. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా నాందేడ్ నుంచి నంద్యాల మీదుగా తిరుపతికి వెళుతుంది. ప్రతి శుక్రవారం నాందేడ్ నుంచి బయలుదేరే ఈ రైలు చర్లపల్లి, పిడుగురాళ్ల, మార్కాపురం, నంద్యాల, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మీదుగా ప్రయాణించి మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శనివారం మధ్యాహ్నం 2.20 గంటలకు తిరుపతి నుంచి బయలు దేరి అదే రోజు రాత్రి 7.40 గంటలకు నంద్యాలకు వస్తుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. నంద్యాల నుంచి ఎర్రగుంట్ల వరకు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సంబంధించి ఏడు రైల్వే స్టాపింగ్‌లు ఉండగా నంద్యాల, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల స్టేషన్లలో మాత్రమే స్టాపింగ్ వసతి కల్పించింది. బనగానపల్లె, కోవెలకుంట్ల, వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు స్టేషన్లలో స్టాపింగ్ లేకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో గుంటూరు నుంచి తిరుపతికి నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో నంద్యాల నుంచి తిరుపతికి టికెట్ ధర రూ. 205 ఉండగా కొత్తగా నడిపే ప్రత్యేక రైలు జీరో సర్వీస్ కావడంతో టికెట్ ధర రూ. 400గా నిర్ణయించారు.

తిరుపతికి ప్రత్యేక రైలు.. అయినా ఆగదు!

తిరుపతికి ప్రత్యేక రైలు.. అయినా ఆగదు!

తిరుపతికి ప్రత్యేక రైలు.. అయినా ఆగదు!