
ఖాళీ జాగా.. టీడీపీ నాయకుల పాగా!
రుద్రవరం: ఎక్కడైన ఖాళీ జాగా కన్పిస్తే చాలు టీడీపీ నాయకులు పాగా వేస్తున్నారు. అది లే అవుట్ అయినా.. డీకేటీ భూములైనా.. వదలడం లేదు. రెవెన్యూ అధికారులు వారించినా.. వెనకడుగు వేయడం లేదు. రుద్రవరం మండలం చందలూరు, హరినగరం సమీపంలోని నవ అహోబిల వద్ద ఉన్న ఖాళీ భూములను టీడీపీ నాయకులు ఆక్రమించారు. దర్జాగా ట్రాక్టర్లతో సేద్యాలు చేసి పాగా వేశారు. చందలూరు గ్రామానికి చెందిన ఓ దాత దాదాపు 40 ఏళ్ల క్రితం గ్రామస్తులకు ఇళ్ల స్థలాల కోసం 7.75 ఎకరాలు కేటాయించారు. అప్పట్లోనే ఆ పొలాన్ని ప్రభుత్వానికి అప్పగించారు. అయితే అప్పటి నుంచి ప్రభుత్వాలు మారాయి కానీ.. ఆ స్థలంలో ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వలేక ఖాళీగా వదిలేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆ స్థలాన్ని లే అవుట్‌గా మార్చి పక్కనే ఉన్న ఎస్సీ కాలనీ వాసులకు కొంత మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారు. కాలనీ లో మట్టి రోడ్లు వేశారు. అలాగే మల్టీ పర్పస్ గోదాము నిర్మించారు. అలాగే అదే స్థలంలో ఓ వైపు వాగు పక్కన కొత్తగా బోరు వేసి మోటార్ అమర్చి రజకులకు కేటాయించారు. అయితే ఎస్సీలకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యే సమయంలో ప్రభుత్వం మారింది. దీంతో ఇళ్లు కట్టుకుంటే బిల్లులు వస్తాయో రావో అన్న భయంతో నిర్మాణాలు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ లేఅవుట్ స్థలం ఖాళీగా ఉండటంతో గ్రామ టీడీపీ నాయకుడు చౌరెడ్డి ఇటీవల ట్రాక్టరుతో దున్నేసి ఆ స్థలం తమదే అంటూ పాగా వేశాడు. అలాగే నవ అహోబిలానికి సంబంధించి అప్పటి ఎమ్మెల్యే గంగుల ప్రతాపరెడ్డి దాదాపు వంద ఎకరాల డీకేటీ భూమిని కేటాయించారు. అయితే అహోబిల ఆలయ నిర్వాహకులు 12 ఎకరాల్లో పలు నిర్మాణాలు చేపట్టి మిగిలిన పొలాన్ని ఖాళీగా వదిలేశారు. గతంలో కొందరు టీడీపీ నాయకులే ఆ పొలాలను ఎక్కడ బడితే అక్కడ ఆక్రమించుకున్నారు. ఇంకా కొంత పొలం మిగిలి ఉండగా మూడు రోజుల క్రితం ఆలమూరుకు టీడీపీ నాయకుడు ఆ ఖాళీ పొలాన్ని దున్నేసి ఆక్రమించేశాడు. ఆ ఆక్రమణలపై ఆయా గ్రామాల వీఆర్వోలు చంద్రమోహన్, పుల్లయ్యలను అడగ్గా విచారణ చేసి అక్కడ జరిగిన ఆక్రమణలపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు.
దర్జాగా ప్రభుత్వ భూముల ఆక్రమణ