
భక్తులకు సంతృప్తికర దర్శనమే లక్ష్యం
● దేవదాయశాఖ డీసీ గురుప్రసాద్
మహానంది: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో భక్తులకు సంతృప్తికర, సులభతర దర్శనం కల్పించడమే లక్ష్యంగా దేవదాయశాఖ ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ అన్నారు. మహానంది ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రసాదాల తయారీ, ఇతర విభాగాల్లో మంగళవారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ఏఈఓ ఎరమల మధు, ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్‌రెడ్డి, నీలకంఠరాజు, ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ పి.సుబ్బారెడ్డి, ఇన్‌స్పెక్టర్ నాగమల్లయ్యలతో కలిసి అన్ని విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీ గురుప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈఓ హోదా నుంచి ఆర్‌జేసీ హోదా కలిగిన ఆలయాల్లో సౌకర్యాలపై దృష్టి సారించారని చెప్పారు. ఆర్జిత సేవలతో పాటు ప్రసాదం తయారీ, అన్నప్రసాదం పంపిణీ, క్యూలైన్ల నిర్వహణపై దృష్టి సారించారన్నారు. ఆలయ ప్రాంగణంలో పారిశుధ్య లోపం లేకుండా చూ డాలన్నారు. మాడవీధుల్లో ఉన్న పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని ఆదేశించారు.
స్పౌజ్ పింఛన్ల పంపిణీలో చేతులెత్తేసిన ప్రభుత్వం
కర్నూలు(అగ్రికల్చర్)/నంద్యాల(న్యూటౌన్): స్పౌజ్ పింఛన్ల పంపిణీపై కూటమి ప్రభుత్వం వితంతు మహిళలను తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తోంది. ముందుగా జూన్ 12న పంపిణీ చేస్తున్నామంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచా రం చేసుకుంది. నిధులు కూడా బ్యాంకులకు విడుదల చేసినట్లు ప్రకటించింది. అయితే ఆ రోజు పింఛన్లు పంపిణీ చేయలేక చేతులెత్తేసింది. జూలై నెల పింఛన్లతో పాటు స్పౌజ్ పింఛన్లను కూడా పంపిణీ చేస్తామని ఇటీవల ప్రకటించారు. అయితే మంగళవారం పింఛన్ల పంపిణీ సమయానికి స్పౌజ్ పింఛన్ల పంపిణీని నిలిపేస్తూ ఉత్తర్వు లు జారీ చేసింది. దాదాపు నెల రోజుల క్రితం నుంచి వేలాది మంది మహిళలను కూటమి ప్రభుత్వం ఊరిస్తోంది. కర్నూలు జిల్లాలో 2,319, నంద్యాల జిల్లాలో 2,463 ప్రకారం స్పౌజ్ పింఛన్లు మంజూరు చేసినా, పంపిణీలో మొండిచేయి చూపుతుండటం విమర్శలకు తావిస్తోంది.
పింఛన్ల పంపిణీలో 19వ స్థానం
పింఛన్ల పంపిణీలో మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి కర్నూలు జిల్లా రాష్ట్రంలో 19వ స్థానం, నంద్యాల జిల్లా 16వ స్థానంలో నిలిచాయి. నంద్యాల జిల్లాలో 2,12,985 పింఛన్లకు గాను 1,99,705 పింఛన్లు పంపిణీ పూర్తి చేశారు.

భక్తులకు సంతృప్తికర దర్శనమే లక్ష్యం