
ఆలయ భూమిలో టీడీపీ నేత అక్రమ బోరు
ప్యాపిలి: టీడీపీ నాయకుల బరితెగింపునకు మరో నిదర్శనం ఇది. ఏకంగా ఆలయ భూమిలో బోరు వేసి తన ఫ్యాక్టరీకి నీటిని తరలిస్తున్న వైనమిది. గొల్లపల్లి బుగ్గలోని స్థానిక శివాలయం ఆవరణలో డోన్ పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు మహేశ్ ఖన్నా అక్రమంగా బోర్ వేసి శివాలయం నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సుద్ద ఫ్యాక్టరీకి పైప్‌లైన్ సౌకర్యం కల్పించుకున్నాడు. అధికారుల అనుమతి లేకుండా ఏకంగా శివాలయం ఆవరణలో బోర్ వేసుకోవడం స్థానికంగా విమర్శలకు దారి తీస్తోంది. అయితే ఈ బోర్ నుంచి పైప్‌లైన్ వేసుకుని తన ఫ్యాక్టరీకి నీటి సౌకర్యం కల్పించుకోవడం ఎంత వరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
బీజేపీ నాయకుల ఫిర్యాదు
కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైన బీజేపీ నాయకులు ఈ సంఘటనపై కొద్దిరోజుల క్రితమే తహసీల్దార్ భారతికి ఫిర్యాదు చేశారు. బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు కేసీ మద్దిలేటి, ప్యాపిలి మండల బీజేపీ నాయకులు దామోదర్ నాయుడు తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. అయినప్పటికీ తహసీల్దార్ ఈ విషయంలో చర్యలు తీసుకోకపోవడం పట్ల బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.