
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
వెల్దుర్తి: బైక్‌ను కారు ఢీకొనడంతో వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన బోయ మనోహర్(19) మృతి చెందాడు. ఈ దుర్ఘటన కల్లూరు మండలం కొంగనపాడు వద్ద హైవే 44 ఓవర్ బ్రిడ్జ్‌పై సోమవారం జరిగింది. ఉలిందకొండ ఎస్‌ఐ ధనుంజయ తెలిపిన వివరాల మేరకు.. చెరుకులపాడుకు చెందిన గౌండ, కూలీలైన రామకృష్ణ, బోయ మనోహర్ కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామ పరిధిలోని ఓ ప్రైవేట్ వెంచర్‌లో ఇంటి పని చేస్తున్నారు. స్వగ్రామం నుంచి ఉదయం 7 గంటలకు బైక్‌పై బయలుదేరారు. ఉలిందకొండ సమీపంలోని హైవేలోని కొంగనపాడు బ్రిడ్జ్ దిగంగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై నుంచి కింద పడిన ఇద్దరూ గాయపడ్డారు. ఉలిందకొండ పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను 108లో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక బోయ మనోహర్ మృతి చెందాడు. మృతుడు బోయ మనోహర్ తండ్రి నాగమద్దయ్య సైతం రెండేళ్ల క్రితం వెల్దుర్తి హనుమాన్ జంక్షన్‌లో లూనా మోటార్ సైకిల్‌ను లారీ ఢీకొనడంతో మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లి శివలింగమ్మ కన్నీటి పర్యంతమైంది. విషయం తెలుసుకున్న పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కర్నూలు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. చికిత్స పొందుతున్న రామకృష్ణకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. కాగా..సీసీ కెమెరాలు, ఇతర మార్గాల ద్వారా ఢీకొన్న కారు నంబరును పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.